మున్సిపల్ పోరుకు నామినేషన్ల జోరు.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో షురూ

by Ajay Maddhiboyina |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నామినేషన్ల పర్వం బుధవారం అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలిరోజు నామినేషన్ల సంఖ్య ఆశించిన స్థాయిలో లేనప్పటికీ, ఆశావహుల రాకతో ఎన్నికల కేంద్రాలు సందడిగా మారాయి.

మున్సిపల్ పోరుకు నామినేషన్ల జోరు.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో షురూ
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నామినేషన్ల పర్వం బుధవారం అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలిరోజు నామినేషన్ల సంఖ్య ఆశించిన స్థాయిలో లేనప్పటికీ, ఆశావహుల రాకతో ఎన్నికల కేంద్రాలు సందడిగా మారాయి. ఆదిలాబాద్‌లో 8, నిర్మల్‌లో 5, కాగజ్‌నగర్‌లో 5 చొప్పున నామినేషన్లు దాఖలు కావడంతో బల్దియా పోరుకు తొలి అడుగు పడింది. గడువు కేవలం మూడు రోజులే ఉండటంతో అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలు, పన్ను బకాయిల చెల్లింపుల కోసం మున్సిపల్ కార్యాలయాల వద్ద ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గురు, శుక్రవారాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేసే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.

- దిశ, నెట్‌వర్క్

దిశ ప్రతినిధి, నిర్మల్/ఆదిలాబాద్/కాగజ్ నగర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఎన్నికల సంఘం కేవలం మూడు రోజులే గడువు ఇవ్వడంతో తొలిరోజే అభ్యర్థులు, ఆశావహులతో నామినేషన్ కేంద్రాలు సందడిగా మారాయి. అయితే, ధ్రువీకరణ పత్రాల సేకరణ మరియు ఇంటి పన్ను బకాయిల చెల్లింపుల వంటి పనుల్లో అభ్యర్థులు నిమగ్నమవడంతో మొదటి రోజు నామినేషన్ల సంఖ్య మందకొడిగా సాగింది.

జిల్లా కేంద్రాల్లో ఇలా..

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. నిర్మల్ మున్సిపాలిటీలో ఒక్కరూ నామినేషన్ వేయకపోగా, భైంసాలో ఇద్దరు, ఖానాపూర్‌లో ముగ్గురు అభ్యర్థులు పత్రాలను సమర్పించారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీ కేంద్రంలో 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక అభ్యర్థి ఉన్నారు. కొన్ని పత్రాల్లో తప్పులు ఉండటంతో పలువురు అభ్యర్థులు వెనుతిరగాల్సి వచ్చింది.

కాగజ్‌నగర్‌లో 5 నామినేషన్లు

కాగజ్‌నగర్ పురపాలక సంఘంలో తొలిరోజే 5 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి తెలిపారు. బీజేపీ నుండి గజ్జల లావణ్య (8వ వార్డు), దెబ్బటి శ్రీనివాస్ (11వ వార్డు), దేశ్‌ముఖ్ శ్రీనివాస్ రావు (24వ వార్డు) నామినేషన్లు వేయగా.. కాంగ్రెస్ పార్టీ నుండి జాడి శశికళ (25వ వార్డు), సరిత ధరావత్ (30వ వార్డు) తమ పత్రాలను సమర్పించారు.

తక్కువ నమోదుకు కారణాలివే..

నామినేషన్లకు సమయం తక్కువగా ఉండటమే ప్రధాన ఇబ్బందిగా మారింది. కుల, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు 'నో అబ్జెక్షన్' సర్టిఫికెట్లు (NOC) పొందడానికి అభ్యర్థులు నానా అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయాల్లో ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తేనే నామినేషన్‌కు అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేయడంతో అభ్యర్థులు ప్రత్యేక కౌంటర్ల వద్ద బారులు తీరారు. గురు, శుక్రవారాల్లో నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Next Story