బడి పంతులా.. బజారు కూలీలా?

by Pulgam srinivas |   (  Updated:2026-04-05 04:54:06  IST  )

= ప్రైవేట్ టీచర్లపై అడ్మిషన్ల భారం = వేసవి సెలవుల్లోనూ తప్పని తిప్పలు = జీతాల కోతతో యాజమాన్యాల వేధింపులు = ఉపాధ్యాయ వృత్తికి తప్పని అవమానం

బడి పంతులా.. బజారు కూలీలా?
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది.ఉన్నత విద్యావంతులై ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లలో చేరిన వారు ఇప్పుడు శ్రమ దోపిడీకి గురవుతున్నారు.బోధనకే పరిమితం కావాల్సిన ఉపాధ్యాయులు,ప్రస్తుతం అడ్మిషన్ల వేటలో మార్కెటింగ్ ఉద్యోగుల్లా మారిపోతున్నారు.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యాజమాన్యాలు ఉపాధ్యాయులకు అడ్మిషన్ టార్గెట్లు విధిస్తూ ఒత్తిడి తెస్తున్నాయి.టార్గెట్ పూర్తి చేయకపోతే ఉద్యోగ భద్రత ఉండదని,జీతాలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు.దీంతో ఉపాధ్యాయులు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.వేసవి కలాన్ని సైతం లెక్కచేయకుండా మండుటెండల్లోనూ ఊరూరా, ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను చేర్పించేందుకు శతవిధాల ప్రయత్నిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

అరకొర జీతాలు..ఆపై టార్గెట్లు

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే జీతాలు ఇవ్వడం వల్ల కుటుంబ పోషణ కూడా కష్టమవుతోంది.ఇళ్ల అద్దె, నిత్యావసర ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి.అంతేకాకుండా, ఒక్కరోజు సెలవు తీసుకున్నా వేతన కోతలు విధించడం మరింత భారంగా మారుతోంది.కరోనా సమయంలో పాఠశాలలు మూతపడడంతో చాలా మంది ఉపాధ్యాయులు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయినా కూడా వేరే ఉపాధి అవకాశాలు లేక అదే వృత్తిలో కొనసాగుతున్నారు.

మార్కెటింగ్ ఉద్యోగుల్లా మారిన వైనం..

జిల్లాలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే..వేసవి సెలవులు కూడా ఇవ్వకముందే యాజమాన్యాలు అడ్మిషన్ల టార్గెట్లు విధిస్తున్నాయి.దీంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు సెలవుల్లో కూడా ఉపాధ్యాయులు విశ్రాంతి తీసుకోలేకపోతున్నారు.ఒంటి పూట బడులు ఉన్నా..వారికి ఉదయం పాఠశాలలో బోధన చేసి,మధ్యాహ్నం నుంచి మండుటెండలో అడ్మిషన్ల కోసం తిరగాల్సిన పరిస్థితి నెలకొంటుంది.మరో వైపు రోజూ ఫోన్ కాల్స్ చేసి టార్గెట్ పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.దీంతో ఉపాధ్యాయులు బోధన వృత్తి గౌరవాన్ని కోల్పోయి మార్కెటింగ్ ఉద్యోగుల్లా మారిపోతున్నారు.ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఉద్యోగాలు వదిలివేస్తున్నారు. అయినా చాలామంది ఉద్యోగం పోతుందనే భయంతో ఈ విషయాలను బయటకు చెప్పలేకపోతున్నారు.

పర్యవేక్షణ లేక కొరవడిన నిఘా..

జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలు అతిక్రమిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.అడ్మిషన్ల పేరిట డొనేషన్లు ఇప్పటి నుంచే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఉపాధ్యాయులకు సరైన వేతనాలు ఇస్తున్నారా..? నిబంధనల ప్రకారం సెలవులు ఇస్తున్నారా..? అనే అంశాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి.

పని ఒత్తిడి తగ్గించాలి..

నర్ర నవీన్ యాదవ్, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి

ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులను కేవలం బోధనకే పరిమితం చేయాలి.వారిని ఒత్తిడికి గురి చేయవద్దు.వేసవి సెలవుల్లో పనులు చేయించుకోకూడదు.అడ్మిషన్ల భారం తగ్గిస్తేనే విద్యార్థులకు వారు మెరుగైన బోధన అందించగలుగుతారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..

రాజేశ్వర్, డీఈఓ

ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగినట్టు ఫిర్యాదులు వస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.సెలవుల్లో ఉపాధ్యాయులను అడ్మిషన్ల కోసం తీసుకెళ్లడం విరుద్ధం ఉపాధ్యాయులకు తగిన వేతనాలు ఇచ్చి ఒత్తిడి తగ్గించాలి.ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి.

Next Story