నిర్మల్ వైద్యుడికి ఐరన్ మ్యాన్ టైటిల్

by Ratna Kumari |

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ న్యూరో వైద్యుడు డాక్టర్ బీ.ఎల్ నరసింహారెడ్డి అరుదైన ఘనత సాధించారు. అంతర్జా

నిర్మల్ వైద్యుడికి ఐరన్ మ్యాన్ టైటిల్
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ న్యూరో వైద్యుడు డాక్టర్ బీ.ఎల్ నరసింహారెడ్డి అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ ఐరన్ మ్యాన్ టైటిల్ పోటీల్లో ఆయన విజేతగా నిలిచారు. గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో 64 దేశాలకు చెందిన అభ్యర్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కేవలం ఎనిమిది గంటల వ్యవధిలో 70.3 మైళ్ళ లక్ష్యసాధన తో నిర్వహించిన ఈ పోటీల్లో డాక్టర్ నరసింహారెడ్డి ఐరన్ మ్యాన్ టైటిల్ సాధించి తెలంగాణ కీర్తిని నిలబెట్టారు. తెలంగాణ నుంచి తొమ్మిది మంది మాత్రమే ఈ పోటీల్లో పాల్గొన్నారు.

8 గంటల్లో సాహసోపేతమైన దీక్ష...

డాక్టర్ నరసింహారెడ్డి నిర్మల్ సైకిల్ క్లబ్ ఏర్పాటు లో కీలకపాత్రను పోషించారు. అప్పటినుంచి సైక్లింగ్ పై మక్కువ పెంచుకున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో నిర్వహించిన పోటీలలో ఆయన పాల్గొన్నారు. గతంలోనే 200 కిలోమీటర్ల సైకిల్ మారథాన్ లో తన రికార్డు భద్రం చేసుకున్నారు. తాజాగా ఆదివారం గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఐరన్ పోటీల్లో ఆయన పాల్గొన్నారు. అరేబియా సముద్రంలో 1.9 కిలోమీటర్ల ఈత పోటీల్లో పాల్గొని టైటిల్ సొంతం చేసుకున్నారు. బలమైన అలలతో పాటు అరేబియా సముద్రంలో నిర్వహించే ఈత పోటీలలోనే ఎక్కువమంది అభ్యర్థులు డిస్ క్వాలిఫై అవుతారని నిర్వాహకులు తెలిపారు. గంట పది నిమిషాల్లో రెండు కిలోమీటర్ల ఈత తో పాటు, 3.45 గంటల్లో 90 కిలోమీటర్ల సైక్లింగ్, 2.45 గంటల్లో 21 కిలోమీటర్ల రన్నింగ్ పోటీల్లోనూ ఆయన విజయం సాధించారు. సుమారు 6 నెలలుగా నిర్మల్ తోపాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో ఈత ప్రాక్టీసు చేశానని, సైక్లింగ్ రన్నింగ్ విషయంలోనూ నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి ముందే పూర్తి చేసినట్లు డాక్టర్ నరసింహారెడ్డి వెల్లడించారు. సైక్లింగ్ రన్నింగ్ పెద్దగా కష్టం కాలేదని, అరేబియా సముద్రంలో బలమైన అలలతో పాటు రూట్ మ్యాప్ విషయంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం సుసాధ్యం చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. కఠోర దీక్ష వల్లనే ఈ పోటీల్లో విజయం సాధించానని, ఐరన్ మ్యాన్ టైటిల్ పొందడం సంతృప్తిగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఐరన్ మ్యాన్ టైటిల్ కు ఎంపికైన డాక్టర్ నరసింహారెడ్డిని నిర్మల్ వైద్యులతో పాటు స్థానిక ప్రముఖులు జిల్లా వాసులు అభినందించారు.

Next Story