కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయ‌కుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ

by Ratna Kumari |

దిశ‌, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని రైతు వేదిక వద్ద బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్, పోలీసులు, అధికారుల సమక్షంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మ‌ధ్య‌ ఘర్షణ ఉద్రిక్త వాతావరణానికి

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయ‌కుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ
X

దిశ‌, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని రైతు వేదిక వద్ద బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్, పోలీసులు, అధికారుల సమక్షంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మ‌ధ్య‌ ఘర్షణ ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. బుధ‌వారం నియోజకవర్గ కేంద్రంలోని రైతు వేదిక లో బోథ్, సోనాల మండలాలకు చెందిన కళ్యాణ ల‌క్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బోథ్ ఏమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాంగ్రెస్ నేత అయిన బోథ్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ ప్రోటో కాల్ లేనివారిని స్టేజ్ పైన ఎలా కూర్చోపెడతారని అధికారులను అడగడంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయ‌కులు మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ నీకు ప్రోటోకాల్ ఉందా..? అని అడగడం తో వివాదం రాజుకుంది. కొంతమంది బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకోవడం తో కళ్యాణ లక్ష్మీ చెక్కుల కోసం వచ్చిన లబ్దిదారులు ఏమీ జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.


స్థానిక పోలీసులు గొడవ పడుతున్న నాయకులను నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి ఆడే గజేందర్ రైతు వేదిక వద్దకు చేరుకుని అధికారులు ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని వారి అనుచరులపై దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ధర్నా చేశారు. స్థానిక ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మీ చెక్కుల కార్యక్రమాన్ని ముగించుకుని బయటకు వెళ్లే సందర్భంలో ఓ కాంగ్రెస్ నాయకుడి కారు అడ్డుగా ఉండడంతో వివాదం మళ్లీ మొదలయింది. స్థానిక పోలీసులు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడం తో ఘటనా స్థలానికి డీఎస్పీ జీవన్ రెడ్డి చేరుకుని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆడే గజేందర్ తో మాట్లాడి గొడవను సద్దుమణిగించి అక్కడ ఉన్న నాయకులను, కార్యకర్తలను పంపించి వేశారు. ఘటన స్థలానికి ఇచ్చోడా, బోథ్ సీఐలు, బజార్ హత్నూర్, నేరడిగొండ, బోథ్ ఎస్సై లు, పోలీసులు ఘర్షణ వాతావరణాన్ని అదుపులోకి తీసుకువచ్చారు.

Next Story