- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవుట్‌సోర్సింగ్ దందా: నిరుద్యోగమే పెట్టుబడి.. వసూళ్లే లక్ష్యం!
జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీలు నిలువునా దోచుకుంటున్నాయి.

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో ప్రైవేట్ ఏజెన్సీలు నిరుద్యోగులను నిలువునా దోచుకుంటున్నాయి. ప్రభుత్వ కొలువుల పేరుతో పోస్టును బట్టి రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పత్రికా ప్రకటనలు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా నియామకాలు చేస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారు. బ్రోకర్ల మాఫియా నిరుద్యోగులను నమ్మించి ఏజెన్సీల ద్వారా భారీగా కమీషన్లు దండుకుంటోంది. తాజాగా నర్సింగ్ కళాశాలలో 50పోస్టులను నోటిఫికేషన్ లేకుండానే భర్తీ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుని, నియామకాల్లో పారదర్శకత పాటించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో భారీస్థాయిలో అక్రమ వసూళ్లు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో కొలువు ఇప్పిస్తామని నమ్మబలికి కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి తెరలేపాయి. పోస్టు స్థాయిని బట్టి రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు ధర నిర్ణయించి, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను ఒక లాభదాయక వ్యాపారంగా మార్చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, ‘గవర్నమెంట్ ఉద్యోగం’ అనే మాట వినగానే నమ్మకంతో ఏజెన్సీలకు రూ.లక్షలు సమర్పించుకుని మోసపోతున్నారు.
గుట్టుగా నియామకాలు.. పారదర్శకత శూన్యం!
జిల్లాలో కొన్ని అవుట్ సోర్సింగ్ పోస్టులను ఏజెన్సీలు ఎలాంటి అధికారిక ప్రకటనలు లేదా పత్రికా ప్రకటనలు ఇవ్వకుండానే అత్యంత రహస్యంగా భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖాళీల వివరాలను ప్రజలకు తెలియనివ్వకుండా, ముందుగానే ఎంపిక చేసిన వ్యక్తుల నుంచి భారీగా నిధులు వసూలు చేసి నియామక ప్రక్రియను ముగిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల అర్హత కలిగిన వేలాది మంది పేద నిరుద్యోగులకు కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోతోంది. నియామక ప్రక్రియను పూర్తిగా గోప్యంగా ఉంచడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది.
మధ్యవర్తుల మాఫియా.. కమీషన్ల వేట!
ఈ అక్రమ దందాలో బ్రోకర్ల వ్యవస్థ అత్యంత కీలకంగా పనిచేస్తోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ఏజెంట్లు యాక్టివ్‌గా ఉంటూ అమాయక నిరుద్యోగులను ఏజెన్సీల వద్దకు చేరుస్తున్నారు. ‘లోపల అంతా సెట్టింగ్ ఉంది.. పై అధికారులతో మాట్లాడాం.. డబ్బులిస్తే ఉద్యోగం ఖాయం’ అంటూ అభ్యర్థులను బుట్టలో వేసుకుంటున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి వేలల్లో కమీషన్ తీసుకుంటూ ఈ మాఫియా కోట్లు గడిస్తోంది. కొంతమందిని తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుని, కొద్ది రోజుల తర్వాత ఏదో ఒక సాకుతో తొలగించి మళ్లీ కొత్త వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నర్సింగ్ కళాశాలలో అడ్డదారి నియామకాలు..
తాజాగా ఆదిలాబాద్ రిమ్స్ పరిధిలోని నర్సింగ్ కళాశాలలో జరిగిన 60 పోస్టుల భర్తీ వ్యవహారం జిల్లాలో కలకలం రేపుతోంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ పోస్టుల్లో 10 పోస్టులు ‘104’ ఉద్యోగులకు కేటాయించగా, మిగిలిన 50పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సి ఉంది. అయితే, ఉపాధి కల్పన శాఖ ద్వారా ఎంప్యానల్‌మెంట్ పొందిన సాన్వీ, జీపీ, కావ్య ఏజెన్సీలు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఈ పోస్టులను అమ్ముకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పారదర్శకమైన నియామక ప్రక్రియను చేపట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఏజెన్సీలు నిబంధనలు పాటించాలి..
జిల్లాలోని ఏజెన్సీలు నిబంధనలు పాటించాలి. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలు ఉద్యోగాలను భర్తీ చేయాలి. తాజాగా నర్సింగ్ కళాశాలలో అడ్డదారిలో ఉద్యోగాల భర్తీ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తాం. ఏజెన్సీలు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్టులో పెడతాం. నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎవరికి డబ్బులు ఇవ్వవద్దు.
- మిల్కా, ఉపాధి కల్పన అధికారి, ఆదిలాబాద్.
అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ఏజెన్సీలపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. డబ్బు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలి. అర్హత ఉన్నవారిని పక్కనపెట్టి డబ్బు ఇచ్చిన వారిని తీసుకోవడం అన్యాయం. అవుట్ సోర్సింగ్ నియామకాల్లో పూర్తిగా పారదర్శకత తీసుకురావాలి. ఇలాంటి దందాలను అరికట్టకపోతే చాలా మంది నిరుద్యోగులు మోసపోయే ప్రమాదం ఉంది.
- దుర్గం గంగేశ్వర్, ఉట్నూర్






