- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ACBకి తప్పని ఎదురుచూపులు.. ప్రాసిక్యూషన్‌కు నో పర్మిషన్!
లంచాలు తీసుకుంటున్న వందలాది మంది ప్రభుత్వ అధికారులు, వివిధ విభాగాల సిబ్బందిని ఏసీబీ వలవేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: లంచాలు తీసుకుంటున్న వందలాది మంది ప్రభుత్వ అధికారులు, వివిధ విభాగాల సిబ్బందిని ఏసీబీ వలవేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నది. అంతేకాకుండా ఆకస్మిక దాడులు చేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ఆఫీసర్ల గుట్టును బయటపెడుతున్నది. అయితే ఈ హడావిడి అంతా దాడుల వరకే.. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాసిక్యూషన్ కోసం అనుమతి లభించకపోవడంతో శాఖాపరమైన విచారణలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అవినీతి అధికారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదనే చర్చ జరుగుతున్నది. అందుకే కొందరు రెండు, మూడు సార్లు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నట్లు తెలుస్తున్నది.
పదేండ్లలో సుమారు 800 కేసులు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2024 వరకు ఏసీబీ అధికారులు వందలాది కేసులు నమోదు నమోదు చేశారు. ఇందులో నేరుగా లంచాలు తీసుకుంటూ దొరికిన వారు కొందరుంటే.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వారు మరికొందరు ఉన్నారు. అయితే వీరి ప్రాసిక్యూషన్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో పట్టుబడ్డ అవినీతి అధికారుల ప్రాసిక్యూషన్ కు సైతం పర్మిషన్ ఇవ్వలేదు. శాఖాపరమైన విచారణలు, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీకి మాత్రమే సిఫార్సు చేశారు. దీంతో ప్రాసిక్యూషన్ వరకు వెళ్లకుండానే.. చిన్న చిన్న విచారణలతో ఉద్యోగులను వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 800 కేసుల్లో ప్రాసిక్యూషన్ కోసం ఏసీబీ అధికారులు అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఏసీబీ కేసుల్లో పట్టుబడినా ఏం కాదనే సంకేతాలను ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముఖ్యులు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఇవ్వడంతో అధికారుల్లో భయం లేకుండాపోయినట్టు తెలుస్తున్నది. దీంతో ఏసీబీ కేసులు నమోదవుతున్నా వివిధ శాఖల్లో అవినీతి తగ్గనట్టు సమాచారం. అంతేకాకుండా కొందరైతే ఒత్తిళ్లు తెచ్చి కేసులను కూడా నిర్వీర్యం చేశారనే ఆరోపణలున్నాయి. మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల్లో కొందరు ఉద్యోగులు ఏకంగా రెండు సార్లు ఏసీబీకి చిక్కినా.. వారిపై సాధారణ చర్యలే తీసుకోవడం గమనార్హం.
శాఖాపరమైన విచారణలు లేదా పెండింగ్..
ఏసీబీ కేసుల్లో పట్టుబడుతున్నా.. కొందరు అధికారులు, ఉద్యోగులు పైరవీలు చేసుకొని కేసు ప్రాసిక్యూషన్ వరకు వెళ్లకుండా చూసుకోగలుగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఏసీబీ నమోదు చేసిన కేసులు రాష్ట్ర సచివాలయంలో దీర్ఘకాలంగా పెండింగులో పెట్టి.. తరువాత శాఖాపరమైన విచారణలు లేదా విత్ డ్రా చేసుకోవడమో జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వెంటనే విచారణ చేసి సమర్పించే నివేదికతో ప్రాసిక్యుషన్ కు అనుమతి ఇస్తే అవినీతి, లంచగొండి అధికారుల ఉద్యోగాలు ఊడే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగం పోకుండా ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారు పెద్ద ఎత్తున అవినీతి సోమ్మును రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు లంచాల రూపంలో ఇస్తూ తమ కేసుల్లో చిన్న చిన్న పనిష్మెంట్లతో సరిపుచ్చుతున్నారనే చర్చ జరుగుతున్నది. ఏసీబీ కేసుల్లో పట్టుబడి ఉద్యోగాలు పోయిన వారిని చేతి వేళ్ల మీద లెక్క పెట్టగలగడమే దీనికి నిదర్శనం.
ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తేనే..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏడాది కాలంలోనే అవినీతి నిరోధక శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేసి వందలాది మందిని పట్టుకున్నారు. అయితే ఆ కేసులు ఇంకా ప్రాసిక్యుషన్ దశకు రానట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న విచ్ఛలవిడి లంచాల పర్వాన్ని అరికట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఒక ప్రకటనలో కోరింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసుల్లో సమగ్ర విచారణ జరిపాక.. పట్టుబడ్డ అధికారిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి కోరినప్పుడు.. నెలలోపే పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రాసిక్యూషన్ కు అనుమతి లభిస్తే.. వెంటనే చార్జిషీట్ దాఖలు చేస్తారు. కోర్టులో కేసు విచారణ తరువాత వారి ఉద్యోగం పోయే అవకాశాలు అధికంగా ఉంటాయి.
కొన్ని ఉదాహరణలు ఇలా..
- రంగారెడ్డి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో లా ఆఫీసర్ గా పనిచేసిన సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన మోహన్‌రావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి ఇద్దరు అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని 2010లో రిపోర్టు ఇచ్చారు. ఏసీబీ లేఖ నెం. 26/ఆర్సీటీ-సీ10/2010 రాశారు. ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణపై కేసు విత్ డ్రా చేస్తూ.. ఆయన సహాయకుడు మోహన్‌రావును ప్రాసిక్యూట్ చేయమని రంగారెడ్డి కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. గత 14 సంవత్సరాలుగా ఈ కేసు ఎలాంటి చర్యలు లేకుండా పెండింగులో ఉంది.
- సికింద్రాబాద్ సివిల్ సప్లయ్ సీఆర్ఓ ఆఫీసులో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసిన రాము నాయక్ లంచం తీసుకుంటూ 2011లో ఏసీబీకి చిక్కారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన ఇంటిని సోదా చేయగా.. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ట్రాప్, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసి, సమగ్ర విచారణ జరిపారు. ఆ అధికారిని ప్రాసిక్యూట్ చేయడానికి 2014 మార్చి 28న ఏసీబీ అధికారులు ప్రభుత్వాన్ని అనుమతి కోరగా.. ప్రభుత్వం ప్రాసిక్యూషన్ కు నిరాకరిస్తూ ఈ రెండు కేసులను కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీకి పంపించింది. గత 14 సంవత్సరాలుగా రాము నాయక్ పై ఉన్న రెండు కేసులు ముందుకు సాగడం లేదు.
- రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సహదేవ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు సమగ్ర విచారణ జరిపి, ఆ అధికారిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి కోరుతూ 2011 లో నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ నివేదికను 2014 నవంబర్ 17న శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. గత 14 సంవత్సరాలుగా లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారిపై ఇంకా శాఖాపరమైన విచారణ జరుగుతూనే ఉంది.
- రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నంకు చెందిన సబ్ రిజిస్ట్రార్ వనజకుమారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు. ఏసీబీ సమగ్ర విచారణ జరిపి ఆ అధికారిని ప్రాసిక్యూట్ చేయడానికి 2013లో ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. ప్రభుత్వం ప్రాసిక్యూషన్ కు ఒప్పుకోక కేసు మూసివేసి.. ఆ అధికారినిపై తదుపరి చర్యలు లేకుండా అండర్ పాస్ చేసింది.






