ఇంటర్ బోర్డు తీరుతో 300 మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం: ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వల్ల 300 మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో 300 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని, వారికి వెంటనే హాల్ టికెట్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇంటర్ బోర్డు తీరుతో 300 మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం: ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వల్ల 300 మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో 300 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని, వారికి వెంటనే హాల్ టికెట్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. అనుమతుల్లేని కళాశాలలు నడుస్తున్నా వాటిపై చర్యలు తీసుకోవట్లేదని, ఒకే పేరుతో పదుల సంఖ్యలో బ్రాంచ్ లు నడుపుతూ, ఒక కళాశాలలో అడ్మిషన్ తీసుకొని వేరొక కళాశాలలో చదువుచెప్తుంటే బోర్డు అధికారుల కళ్ళు మూసుకుపోయాయని ఎద్దేవా చేశారు.

విద్యార్థులు పరీక్షల ఫీజులు కళాశాలల్లో చెల్లించినప్పటికీ, ఆ విద్యార్థుల పేర్లు బోర్డు వద్ద నమోదు చేపించకుండా కళాశాలలు నిర్లక్ష్యం చేస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకోకుండా వాటికే వత్తాసు పలుకుతూ కనీసం విద్యార్థులు తమకు ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించండి అడిగితే బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య కర్కశంగా వ్యవహరిస్తున్నారన్నారు. డబ్బులు ఉన్న విద్యార్థులు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారని, డబ్బులు లేని పేద విద్యార్థుల సంగతేంటని నిలదీశారు. గత నాలుగు రోజులుగా కృష్ణ ఆదిత్య ను ఏబీవీపీ ఆధ్వర్యంలో కలిసే ప్రయత్నం చేస్తే తప్పించుకు తిరుగుతున్నారన్నారు. తప్పుచేసిన కళాశాలలపై చర్యలు తీసుకోకుండా,పేద విద్యార్థులు పరీక్షలు రాయకుండా చేయడం సిగ్గుచేటన్నారు.

ప్రైవేట్,కార్పొరేట్ కళాశాలలకు బోర్డు సెక్రటరీ తొత్తుగా మారారని, వారి వద్ద నుండి ఎన్ని కమిషన్లు నొక్కుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే బోర్డు సెక్రటరీనీ వెంటనే తొలగించి, ఆ 300 మంది విద్యార్థులకు వెంటనే పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోట్లాడుతున్న విద్యార్థి నాయకుల అక్రమ అరెస్ట్ లను ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందని, బేషరతుగా వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేసే వరకు ఏబీవీపీ అండగా ఉంటుందని, విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహానగర కార్యదర్శి పృథ్వీ తేజ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story