ఆరోగ్యశ్రీ సేవలు ఆపొద్దు.. ప్రభుత్వం సానుకూలంగా ఉంది: ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ సీఈవో రిక్వెస్ట్

by Ramesh Naini |

ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఆరోగ్యశ్రీ సేవలు ఆపొద్దు.. ప్రభుత్వం సానుకూలంగా ఉంది: ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ సీఈవో రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని (Private hospitals) ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ (Aarogyasri CEO Uday Kumar) విజ్ఞప్తి చేశారు. వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, గడిచిన 21 నెలల్లో రూ.1779 కోట్లను హాస్పిటళ్లకు ప్రభుత్వం చెల్లించిందని ఆయన వెల్లడించారు. ప్యాకేజీల చార్జీల పెంపు కోసం ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలు దశాబ్దకాలం ఎదురుచూశాయని, ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22 శాతానికి పైగా పెంచిన విషయాన్ని సీఈవో గుర్తు చేశారు. కొత్తగా 163 రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చి పేషెంట్లను ప్రభుత్వం ఆదుకుందన్నారు.

చార్జీల పెంపు, కొత్త ప్యాకేజీల చేర్పుతో అదనంగా రూ.487.29 కోట్లు పేషెంట్ల కోసం (Government) ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సగటున నెలకు రూ. 57 కోట్లు హాస్పిటళ్లకు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు సగటున నెలకు రూ.75 కోట్లు చెల్లించామని తెలిపారు. ప్రస్తుతం నెలకు రూ.95 కోట్లు చెల్లిస్తున్నామని, హాస్పిటళ్ల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు నెలకు వంద కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఉదయ్ వెల్లడించారు. హాస్పిటల్స్ యాజమాన్యాల ఇతర విజ్ఞప్తుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఉదయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో సేవల నిలిపివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని హాస్పిటళ్ల యాజమాన్యాలకు సీఈవో విజ్ఞప్తి చేశారు.కాగా, మంగళవారం అర్థరాత్రి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ సేవలను నిలిపివేయనున్నట్లు తెలంగాణ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం (TANHA) ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story