రేవంత్ కేబినెట్‌లో కొత్త ముఖం..! ఉత్తర తెలంగాణ నేతకు మంత్రి పదవి?

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-20 01:39:06  IST  )

కాంగ్రెస్‌ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయడం, ఉత్తర తెలంగాణ‌లో రెడ్డి సామాజిక వర్గ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి కారణంగా అధిష్టానం నష్ట నివారణ చర్యలకు దిగబోతున్నట్లుగా తెలుస్తోంది.

రేవంత్ కేబినెట్‌లో కొత్త ముఖం..! ఉత్తర తెలంగాణ నేతకు మంత్రి పదవి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఉత్తర తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. పార్టీకి ఇంతకాలం గట్టి మద్దతుదారుగా ఉన్న తమకు ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదనే అభిప్రాయంలో ఆ వర్గం నేతలు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం గమనించిన కాంగ్రెస్ అధిష్టానం నష్టనివారణకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తు్న్నది. త్వరలో జరుగనున్న కేబినెట్ విస్తరణలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని యోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఆ రెడ్లకు మంత్రి పోస్టు రాలే..

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని రెడ్డి సామాజిక వర్గం నేతలు రాజకీయాలను ప్రభావితం చేయగలరు. ఆయా జిల్లాల్లో పార్టీల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా ఎదిగారు. కానీ, కాంగ్రెస్ సర్కారులో ఆ వర్గానికి చెందిన లీడర్లకు జిల్లాలు, సామాజిక సమీకరణాల కారణంగా మంత్రి పదవి దక్కలేదు. దీంతో వారంతా గుర్రుగా ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ తమ అసంతృప్తిని వెల్లిబుచ్చుతున్నట్టు తెలిసింది. సరిగ్గా ఈ సమయంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన లీడర్లు అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఉత్తర తెలంగాణ రెడ్లను అవమానాలకు గురిచేసి, పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతున్నది. ఈ విషయం గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఆ లక్కీ పర్సన్ ఎవరు..?

ఉత్తర తెలంగాణకు చెందిన రెడ్డి ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు రావడంతో ఆ అదృష్టవంతుడు ఎవరు? అనే చర్చ జరుగుతున్నది. ఆ 4 ఉమ్మడి జిల్లాల నుంచి ఆరుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.(ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, యశస్విని రెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి రెడ్డి ఎమ్మెల్యేలు లేరు) ఈ ఆరుగురిలో అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సమీకరణలు కుదరకపోవడంతో ప్రభుత్వ సలహాదారు పదవీ ఇచ్చారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు హైకమాండ్ మొగ్గుచూపుతుందా? లేదా జిల్లాల సమీకరణల నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ప్రయారిటీ ఇస్తుందా?అనే చర్చ జరుగుతున్నది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొన్నటివరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎం రేవంత్‌తో అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. కానీ, కొన్ని రోజులుగా ఆయన వ్యవహారశైలిలో మార్పు వచ్చింది. సీఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. దీనితో ఆయనకు ఏమైన కేబినెట్‌లో చాన్స్ దక్కుతుందా? అనే చర్చ జరుగుతున్నది.

రెడ్డి మంత్రులు దక్షిణాది వారే..

రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఆయనతో కలుపుకుని మొత్తం నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. వీరంతా దక్షిణ తెలంగాణకు చెందిన వారే.( రేవంత్ రెడ్డి -ఉమ్మడి మహబూబ్ నగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి-ఉమ్మడి నల్గొండ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి- ఉమ్మడి నల్గొండ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి-ఉమ్మడి ఖమ్మం) దీంతో ఉత్తర తెలంగాణకు చెందిన రెడ్డి లీడర్లు తమకు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదా? ఆ జిల్లాలకు చెందిన లీడర్లతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందా? అని పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

Next Story