నిమ్స్ వైద్యుల అద్భుతం... బాలుడికి పునర్జన్మ

by Kema Shiva Kumar |

క్లీనింగ్ పౌడర్ తాగి ఆహార నాళం దెబ్బతిన్న 13 ఏళ్ల బాలుడికి నిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు.

నిమ్స్ వైద్యుల అద్భుతం... బాలుడికి పునర్జన్మ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రమాదవశాత్తు క్లీనింగ్ పౌడర్ తాగి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఒక 13 ఏళ్ల మానసిక దివ్యాంగ బాలుడికి నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. అత్యంత క్లిష్టమైన ఈసోఫాగస్ (ఆహార నాళం) పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి వైద్య రంగంలో మరో మైలురాయిని అధిగమించారు. సొల్లు సాయి ప్రణీత్ అనే బాలుడు 2024, డిసెంబర్ 5న ఇంట్లో ఉన్న డోమెక్స్ క్లీనింగ్ పౌడర్‌ను పొరపాటున తాగాడు. దీంతో బాలుడి ఆహార నాళం తీవ్రంగా దెబ్బతిని, ఆహారం మింగలేని పరిస్థితి ఏర్పడింది. పోషకాహారం అందించడం కోసం మొదట పొట్టలోకి ఫీడింగ్ ట్యూబ్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం 2025, జూలై 31న మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌లోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి తరలించారు.

సవాళ్లు ఉన్నా.. అద్భుత ఫలితం..

సాధారణంగా ఇలాంటి గాయాలైనప్పుడు ఏడాది కాలం వేచి చూసిన తర్వాతే పునర్నిర్మాణ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. వైద్యుల పర్యవేక్షణలో ఏడాది గడిచిన తర్వాత, ఈ ఏడాది ఏప్రిల్ 17న సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. బీరప్ప నేతృత్వంలోని బృందం భారీ శస్త్రచికిత్సను నిర్వహించింది. దాదాపు రూ. 5 లక్షల ఖర్చయ్యే ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఉచితంగా అందించారు. బాలుడి ఆహార నాళం పూర్తిగా మూసుకుపోవడమే కాకుండా, అతను మానసిక దివ్యాంగుడు కావడంతో శస్త్రచికిత్స అనంతరం అతడిని పర్యవేక్షించడం వైద్యులకు సవాలుగా మారింది. అయినప్పటికీ, నిమ్స్ వైద్య బృందం సమిష్టి కృషితో సర్జరీని విజయవంతం చేసింది. ప్రస్తుతం బాలుడు సాధారణంగా ఆహారం తీసుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఇది కాంప్లికేటెడ్ కేసు..

గడిచిన 34 ఏళ్లలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలేజీ విభాగం ఇలాంటి 600 పైగా కేసులను డీల్ చేసిందని, అందులో 300కు పైగా పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. చికిత్స పొందిన వారిలో 99.4 శాతం మంది సాధారణ స్థితికి చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కేసు కాంప్లికేటెడ్ అని... అయినప్పటికీ తమ వైద్య బృందం శస్త్రచికిత్సను విజయవంతం చేసి బాలునికి పునర్జన్మను ఇచ్చిందని తెలిపారు. చికిత్స కోసం ఆర్థికంగా అండగా నిలిచిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు హెచ్చరిక..

ఇళ్లలో వాడే క్లీనింగ్ పౌడర్లు, యాసిడ్ల విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దని వైద్యులు హెచ్చరించారు. రసాయనాలను పాత వాటర్ బాటిళ్లలో లేదా లేబుల్ లేని డబ్బాల్లో ఉంచవద్దని సూచించారు. విషపూరిత పదార్థాలను పిల్లలకు అందనంత ఎత్తులో లేదా తాళం వేసిన క్యాబినెట్లలో ఉంచాలని తెలిపారు. వాటిని వాడే సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం జీవితకాలం ఇబ్బంది పెడుతుందని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

Next Story