- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారతీయులను శాశ్వతంగా దూరం చేసే కుట్ర.. SIRపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు
ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ ద్వారా కోట్ల మంది భారతీయులను ఓటు హక్కుకు దూరం చేసే కుట్ర జరుగుతోందని కేంద్రంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ప్రక్రియ దేశంలో కేవలం భయాందోళనలు, అనుమానాలను రేకెత్తించడానికి, ఓ వర్గాన్ని ఓటు హక్కుకు శాశ్వతంగా దూరం చేయడానికి ఉపయోగపడుతుందని ఆయన ఆరోపించారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం డాక్యుమెంట్ల ఆధారంగా చేపట్టిన ఈ SIR ప్రక్రియ వల్ల 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 6.5 కోట్ల మంది పేర్లు ఓటర్ల జాబితా నుండి తొలగించబడ్డాయని ఒవైసీ పేర్కొన్నారు. ఇందులో ఎక్కువ శాతం ముస్లింలు, మహిళలు, వలస కార్మికులు, పేదలే ఉన్నారని ఒవైసీ ఆరోపించారు.
పేదవాడికి శక్తివంతులపై ఉన్న ఏకైక ఆయుధం ఓటు హక్కు మాత్రమేనని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అది లేకపోతే ప్రభుత్వం వారిని తమకు నచ్చినట్లుగా వాడుకుంటుందని కామెంట్ చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన వారు భారత పౌరులు కాకుండా పోరని ఆయన స్పష్టం చేశారు. అక్రమ వలసదారులను గుర్తించడం, నిర్బంధించడం, దేశం దాటించడం కోసం ఓ శాశ్వత వ్యవస్థను నిర్మించడానికే ప్రభుత్వం ఇప్పుడు ఓ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటోందని ఆయన ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు తొలగించిన వారిలో ఎంతమంది విదేశీయులు ఉన్నారనే డేటాను ఇవ్వలేదని, మరి ఈ కమిటీ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం ముస్లింలలో భయాన్ని నింపడానికేనని అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు.






