జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు సవాల్ .. తెరపైకి ఆ డిమాండ్లు

by Disha Web Desk 4 |
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు సవాల్ .. తెరపైకి ఆ డిమాండ్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రజలకు సుపరిచితమైన టీఆర్ఎస్ పార్టీ ఇక జాతీయ పార్టీగా మారబోతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దసరా రోజున టీఆర్ఎస్ స్థానంలో కొత్త పేరు రాబోతోంది. విజయదశమి నుండి టీఆర్ఎస్ ప్రస్థానం మరో పేరుతో మొదలు కానుంది. జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీని, కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడమే టార్గెట్ గా కేసీఆర్ రాజకీయ కత్తులు దూస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను హైలెట్ చేస్తూ కేసీఆర్ తన జాతీయ పార్టీని ముందుకు తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగం, దళితుల స్థితిగతులే ప్రధాన అస్త్రాలుగా కేసీఆర్ జాతీయ ఎజెండాగా ఉండబోతుందనేది ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం. అయితే ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ అధినేత ముందు మరో అసలైన సవాల్ సిద్ధంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ ముందు అసలైన అగ్నిపరీక్ష

కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నాడు అనే ప్రచారం జరుగుతున్న నాటి నుండి కూడా ఓ వాదన తెరపైకి వస్తూనే ఉంది. కేసీఆర్ ఓ ప్రాంతానికి రాష్ట్రం హోదా సాధించడానికి పార్టీ పెట్టుకున్నారని, ఆయన విచ్ఛిన్న వాది అంటూ ఆయన ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండుగా విడిపోవడానికి కారణం అయిన కేసీఆర్ ఏపీలో ఏమని ప్రజల్లోకి వెళ్తారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో తెలంగాణ మాదిరిగా తమను ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించాలని అనేక రాష్ట్రాల్లో డిమాండ్లు ఉద్యమాలు కొనసాగుతున్నాయి.

ఉత్తర ప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా, తమిళనాడును రెండుగా విభజించాలని, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు కొనసాగుతున్నాయి. మరి చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ఇన్నాళ్లు చెప్పిన కేసీఆర్.. ఇకపై కూడా ఇదే మాటపై ఉంటారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కేసీఆర్ చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని చెప్పినట్లుగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక ప్రకటిస్తే ఆయాస్టేట్స్ లో పొలిటికల్ రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.


Next Story