- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటుకు.. నోటు ఎర!
ఆర్మూర్ డివిజన్ లోని ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్ గల్, డొంకేశ్వర్, కమ్మర్ పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 146 సర్పంచ్ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్మూర్ డివిజన్ లోని ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్ గల్, డొంకేశ్వర్, కమ్మర్ పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 146 సర్పంచ్ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ బరిలో 562 మంది పోటీలో ఉన్నారు. డివిజన్ లోని 165 సర్పంచ్ స్థానాలకు గానూ ఇప్పటికే 19 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 146 సర్పంచ్ స్థానాలకు మాత్రమే పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ సిబ్బంది మంగళవారం రాత్రికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
అర్ధరాత్రి వరకు కొనసాగిన డబ్బుల పంపిణీ
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన సర్పంచ్ అభ్యర్థులు మంగళవారం అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా డబ్బుల పంపిణీని కొనసాగించారు. ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయల నుంచి రూ.2వేలు, రూ.3వేలు డిమాండ్ ను బట్టి ఓటర్లకు పంపిణీ చేశారు. ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయో అంత మందికీ ఒక్కో ఓటుకు లెక్క కట్టి మరీ నోట్ల పంపిణీ చేశారు. ఆర్మూర్ డివిజన్ లోని పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీల్లో ఈ ఒక్క రాత్రికే దాదాపు 50 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అనధికారిక అంచనాగా చెప్పుకుంటున్నారు. నామినేషన్లు వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ. 110 కోట్ల వరకు ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ డివిజన్ లోని గ్రామాలన్నీ రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే ఎక్కువగా ఉంటాయి. రాజకీయాన్ని గెలుపును ఇక్కడి నాయకులు, కార్యకర్తలు చాలా సీరియస్ గా తీసుకునే కల్చర్ ఉంది. గెలుపు కోసం ఎంతదాకైనా వెళతారు.. ఎంతైనా ఖర్చు చేస్తారు. ఆస్తులను తెగనమ్మయినా ఎన్నికల కోసం ఖర్చు చేసే తెగింపు ఇక్కడి వారి సొంతం. అదే పంథాలో విచ్చల విడిగా ఖర్చు చేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు సాయంత్రం లోపు తేలనుంది.
అర్ధరాత్రి వరకు తలుపులు తెరుచుకునే ఉన్నాయి..
సర్పంచ్ అభ్యర్థులతో పాటు, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం ఓటర్లకు డబ్బులు, మద్యం సీసాలు పంపిణీ చేస్తుండటంతో ఓటర్లు అర్ధరాత్రి దాటినా తలుపులు బార్లా తెరుచుకుని కూర్చున్నారు. ఓటర్లకు నోట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి అభ్యర్థుల తరఫున కార్యకర్తలు, వారి అనుచరులు చేపట్టడంతో ఏ క్షణమైనా డబ్బులు ఇచ్చేందుకు తమ వద్దకు వస్తారని, ఆ క్షణంలో ఇంటి తలుపులు మూసి ఉంచితే వచ్చే డబ్బులు రాకుండా పోతాయనే భయంతో జనం అర్ధరాత్రి దాటినా తలుపులు తెరుచుకుని ఇంటి బయట లైట్ వేసుకుని కూర్చున్నారు. చాలా మంది తమ ఇంటికి ఎవరూ రాలేదేం అంటూ ఫోన్లు చేసి ప్రశ్నించినట్లు తెలిసింది.
వ్యక్తిగతం వేరు.. కుల సంఘాలకు వేరు..
గ్రామంలోని కుల సంఘాలకు రూ.లక్షల్లో ఇస్తూనే, మళ్లీ ఆయా కులాలకు చెందిన వారికి వ్యక్తిగతంగా కూడా ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయలు, రూ. 2 వేలు పంపిణీ చేసినట్లు తెలిసింది. భీమ్ గల్ మండలం బడాభీమ్‍గల్ లో సర్పంచ్ స్థానాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ, వెయ్యి రూపాయల నుంచి రూ. 3 వేల వరకు పంచినట్లు చెబుతున్నారు. ఒక వర్గానికి చెందిన వారి ఓట్లన్నీ గంపగుత్తగా తమకు వ్యతిరేకంగా పడే అవకాశాలున్నాయనే భయంతో ఒక సర్పంచ్ అభ్యర్థి ఒక కులం లోని రెండు ఉప కులాల సంఘాలకు రూ. లక్షల్లో ముట్టజెప్పినట్లు సమాచారం. సంఘాలకు డబ్బులు పెద్దమొత్తంలో పంచుతూనే ఓటర్లందరికీ వ్యక్తిగతంగా ఓటుకు వెయ్యి రూపాయలు పంచినట్లు తెలుస్తోంది.
అందరి నుంచి నోట్లు తీసుకున్న ఓటర్లు..
తమకు ఓటు వేయాలని కోరుతూ అభ్యర్థులు ఇచ్చిన డబ్బులను అందరి నుంచి తీసుకున్న ఓటర్లు నేడు జరిగే పోలింగ్ లో ఏ అభ్యర్థికి ఓటు వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. డబ్బులు పంచారనే ధైర్యం, వారు ఒట్టేసారు.. ఓట్లేస్తారనే నమ్మకంతో అభ్యర్థులున్నప్పటికీ నేడు జరుగుతున్న ఎన్నికల్లో ఎవరిని ఎత్తుకుంటారో.. ఎవరిని ఎత్తేస్తారో ఓటర్లు తమ చేతిలోని వజ్రాయుధంతో తేల్చనున్నారు.






