గ్యారెంటీలు రాసిచ్చి 800 రోజులైనా ఒక హామీకి దిక్కులేదు: హరీష్ రావు

by Prasad Jukanti |   (  Updated:2026-02-20 07:28:58  IST  )

800 రోజులు గడిచినా హామీలు అమలు కాలేదని హరీశ్‌రావు విమర్శించారు. బడ్జెట్‌లో వీటికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

గ్యారెంటీలు రాసిచ్చి 800 రోజులైనా ఒక హామీకి దిక్కులేదు: హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) బాండ్ పేపర్లు రాసిచ్చి ఇప్పటికీ 800 రోజులైనా ఒక్క హామీకి దిక్కులేదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా ఇచ్చిన హామీలు మాత్రం అమలు కాలేదన్నారు. ఇవాళ సిద్దిపేటలో మాట్లాడిన ఆయన.. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకిచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ రూపొందించాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువత.. ఇలా అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు.

డిక్లరేషన్లన్ని ఉత్తమాటలే:

గెలిచిన నెలకే వృద్ధులు, బీడీ, చేనేత, గీత కార్మికులకు రూ. 4000 పెన్షన్ అన్నారు. 27 నెలలైనా రాలేదని ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నిధులు పెడతారా లేదా? అని ప్రశ్నించారు. నెలకు రూ.2500 ఇస్తామని ఆశచూపి మహిళల ఓట్లు దండుకున్నారని ఒక్కరికైనా రూపాయి ఇచ్చారా? వెంటనే బడ్జెట్‌లో మహిళలకు నిధులు కేటాయించాలన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఈ ప్రభుత్వం ఎగ్గొట్టిందని, రాజీవ్ యువ వికాసం అంతా బూటకం అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తెచ్చిన ఎస్సీ, బీసీ, రైతు డిక్లరేషన్లన్నీ ఉత్త మాటలేనని అసెంబ్లీలో మాయ మాటలు మాని.. వాస్తవ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలన్నారు. ఎస్సీ డిక్లరేషన్ పేరిట దళితులకు 18 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని మోసం చేశారన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభకు సిద్దరామయ్యను తీసుకొచ్చి, బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఏటా రూ. 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక బీసీలకు కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపిందన్నారు.

బల్లలు చరిచి చెప్పిన పథకాల్లో ఒక్కటీ అమలు కాలే:

వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ మాయమాటలు చెప్పారు. ఏటా రూ. 15,000 రైతుబంధు, పంటల బీమా, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను నిలువునా దగా చేశారని విమర్శించారు. ఈసారి బడ్జెట్‌లో బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులు, గీత, చేనేత కార్మికులందరికీ తక్షణమే రూ. 4,000 పెన్షన్ ఇచ్చేలా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను డిమాండ్ చేశారు. గత బడ్జెట్‌లో అసెంబ్లీలో గొప్పగా స్పీచులు దంచి, బల్లలు చరిచి చెప్పిన పథకాలు ఏవీ అమలు కాలేదని. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇప్పటికీ కూలీలకు డబ్బులు అందలేదు, పంటల బీమా రాలేదన్నారు.

Next Story