హైడ్రా ప్ర‌జావాణికి 76 ఫిర్యాదులు.. చెరువుల‌ పునరుద్ధరణపై విన‌తులు

by Ramesh Naini |

న‌గ‌రంలో అభివృద్ధి చెందిన చెరువుల‌ను చూసి.. త‌మ ప్రాంతాల్లో ఉన్న వాటిని కూడా అభివృద్ధి చేయాల‌ని ప‌లువురు కోరుతున్నారు. చెరువులు క‌బ్జా అవ్వ‌కుండా కాపాడాలంటున్నారు. చెరువుల‌ను అనుసంధానం చేసిన వ‌ర‌ద కాలువ‌ల‌ను పున‌రుద్ధ‌రించ‌మ‌ని అడుగుతున్నారు.

హైడ్రా ప్ర‌జావాణికి 76 ఫిర్యాదులు.. చెరువుల‌ పునరుద్ధరణపై విన‌తులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: న‌గ‌రంలో అభివృద్ధి చెందిన చెరువుల‌ను చూసి.. త‌మ ప్రాంతాల్లో ఉన్న వాటిని కూడా అభివృద్ధి చేయాల‌ని ప‌లువురు కోరుతున్నారు. చెరువులు క‌బ్జా అవ్వ‌కుండా కాపాడాలంటున్నారు. చెరువుల‌ను అనుసంధానం చేసిన వ‌ర‌ద కాలువ‌ల‌ను పున‌రుద్ధ‌రించ‌మ‌ని అడుగుతున్నారు. ఒకప్ప‌టి చెరువుల వైభ‌వాన్ని చెబుతూ.. మంచ‌నీటి స‌ర‌స్సుల‌గా మార్చ‌మ‌ని కోరుతున్నారు. జీడిమెట్ల‌లోని ఫాక్స్ సాగ‌ర్, ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువు, కాటేదాన్‌లోని నూర‌మ‌హ్మ‌ద్‌కుంట, ఫిల్మ్‌న‌గ‌ర్ చెరువు ఇలా న‌గ‌రం న‌లుమూల‌ల నుంచి చెరువుల‌ను అభివృద్ధి చేయాల‌ని డిమాండ్లు ఊపందుకున్నాయి. అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ‌కుంట‌, కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువు, పాత‌బ‌స్తీలోని బమ్-రుక్న్ - ఉద్ - దౌలా చెరువు ప‌ర్యాట‌క ప్రాంతాలుగా మారాయ‌ని.. త‌మ ప్రాంతంలో ఉన్న చెరువుల దుర్గంధాన్ని వ‌దిలించాల‌ని ప్ర‌జావాణిలో విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే ర‌హ‌దారులు, పార్కుల ఆక్ర‌మ‌ణ‌ల‌కు సంబంధించిన ఫిర్యాదులూ అందాయి. లే ఔట్‌లోని ర‌హ‌దారుల‌ను, పార్కుల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని డిమాండ్ చేశారు. ఇలా సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి 76 ఫిర్యాదులందాయి. వీటిని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించి సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు దార‌ల ముందే ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. కొన్ని ఫిర్యాదుల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించ‌డానికి వ‌స్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్‌కి చెప్పారు.

ఫిర్యాదులు ఇలా..

జీడిమెట్ల పారిశ్రామిక వాడ‌ను ఆనుకుని ఉన్న ఫాక్స్ సాగ‌ర్ క‌బ్జాల‌ను తొల‌గించి.. మ‌రో ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాల‌ని అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో కోరారు. వెయ్యికి పైగా ఆక్ర‌మ‌ణ‌లున్నాయ‌ని వాటిని తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. ఫాక్స్ సాగ‌ర్ నుంచి నేరుగా హుస్సేన్ సాగ‌ర్‌కు ఉండే వ‌ర‌ద కాలువ కూడా ప‌లుచోట్ల క‌బ్జాల‌కు గురైంద‌ని.. పున‌రుద్ధ‌రించాల‌ని కోరారు. తాగునీటితో పాటు.. సాగునీటిని అందించిన ఈ చెరువును పున‌రుద్ధ‌రిస్తే అనేక మ‌త్స్య‌కార కుంటుంబాల‌కు జీవ‌నోపాధి ల‌భిస్తుంద‌ని.. అక్క‌డ నివాసిత ప్రాంతాల‌కు ఆహ్లాద‌క‌రంగా మారుతుంద‌న్నారు. మ‌రో ప‌ర్యాట‌క ప్రాంతంగా దీనిని అభివృద్ధి చేయ‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం గౌరెల్లి గ్రామంలో సర్వే నెం. 223లో ఉన్న మాలకుంట చెరువును హైడ్రా అభివృద్ధి చేయాల‌ని స్థానికులు కోరారు. చెరువు కట్టను ధ్వంసం చేసి నీటిని బ‌య‌ట‌కు వ‌దిలేసి ఆక్ర‌మ‌ణ‌ల‌కు కొంత‌మంది ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చెరువులో చేప‌ల‌ను పెంచుకుంటూ జీవ‌నోపాది పొందేవాళ్ల‌మ‌ని.. ఇప్పుడు త‌మ బ‌తుకుదెరువు కూడా కోల్పోయామ‌ని వాపోయారు. మాల‌కుంట చెరువు కట్టను వెంటనే పునర్నిర్మించి, చెరువులో వేసిన సిమెంట్ పైపుల‌ను తొలగించాల‌ని కోరారు. వెంట‌నే FTL హద్దు రాళ్లు వేసి చెరువు ఆక్రమణకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు ప్రజావాణిలో కోరారు.

కొండాపూర్ సీఎంసీ లేఔట్‌లో రహదారి ఆక్రమణలు

కొండాపూర్ సీఎంసీ లేఔట్‌లోని రహదారి ఆక్రమణకు గురౌతోంద‌ని నివాసితులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. గ‌తంలో ఫిర్యాదు చేయ‌గా.. GHMC ద్వారా CC రోడ్డు వేయించడంలో HYDRAA చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే అదే రోడ్డులో గ్రావెల్ పోసి రాకపోకలను పూర్తిగా అడ్డుకుంటున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాన రహదారికి అనుసంధాన మార్గంగా ఉండటం వల్ల వెంట‌నే ఆ రోడ్డును పునరుద్ధ‌రించాల‌ని కోరారు. సీసీ రోడ్డుపై మ‌ట్టి పోసి రాక‌పోక‌ల‌కు ఆటంకం క‌లిగించిన ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం పెద్దంబ‌ర్‌పేట విలేజ్‌లోని బాలాజీ లే ఔట్‌ను ఆనుకుని ఉన్న ఓఆర్ఆర్ స‌ర్వీసు రోడ్డును క‌లుపుతూ 40 ఫీట్ల ర‌హ‌దారిని ఆక్ర‌మించి.. ఏకంగా నిర్మాణాలు చేప‌ట్టార‌ని.. దీంతో ఆ లే ఔట్లోని ఇత‌ర ప్లాట్ల‌కు దారి లేకుండా పోయింద‌ని బాలాజీ లేఔట్ ప్లాట్ య‌జ‌మానులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ర‌హ‌దారి స్ప‌ష్టంగా ఉన్నా ఒక‌వైపు ఉన్న ప్లాట్లు కొన్న వ్య‌క్తి ఏకంగా ర‌హ‌దారిని ఆక్ర‌మించి క‌ళాశాల మైదానంగా వాడుకుంటున్నార‌ని.. వెంట‌నే రోడ్దును పున‌రుద్ధ‌రించాల‌ని కోరారు.

Next Story