600 మీటర్ల గ్రోత్ కారిడార్.. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు ఇరువైపులా నిర్మాణం

by Ajay Maddhiboyina |

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను గ్రోత్ కారిడార్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కు ఇరువైపులా కిలోమీటర్ చొప్పున ఏరియాను గ్రోత్ కారిడార్ నిర్ధారించిన విషయం తెలిసిందే.

600 మీటర్ల గ్రోత్ కారిడార్.. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు ఇరువైపులా నిర్మాణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను గ్రోత్ కారిడార్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కు ఇరువైపులా కిలోమీటర్ చొప్పున ఏరియాను గ్రోత్ కారిడార్ నిర్ధారించిన విషయం తెలిసిందే. అదే తరహాలో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు సైతం ఇరువైపులా 300 మీటర్ల చొప్పున గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయడంతో ఇన్‌ఫాక్ట్ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.20 వేల కోట్ల రుణాలను తీసుకోవాలని నిర్ణయించింది. వీటన్నింటిని తీర్చడానికి ఆదాయ వనరులను సైతం పెంచుకోవాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. అందులో భాగంగానే ఇన్‌ఫాక్ట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.

247 కిలోమీటర్ల నిర్మాణం

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 247 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓఆర్ఆర్ రావిర్యాల్ (టాటా ఇంటర్‌చేంజ్) ట్రిపుల్ ఆర్ (ఆమన్‌గల్) వరకు 41.5 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కీలకమైన రహదారిగా మారనుంది. దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. కొత్వాల్​గూడ నుంచి నాచారం వరకు 81 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి నిర్మాణం జరుగుతుంది. ఇది మూడు ప్రధాన పారిశ్రామిక కేంద్రాలకు కనెక్టివిటీగా ఉంటుంది. వీటితోపాటు కోహెడ నుంచి గుడిమల్కాపురం 28.5 కి.మీ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10 (తారామతిపేట్) నుంచి ఎర్రంబల్లి 31.4 కి.మీ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 8 కీసర నుంచి కోమటికుంట 29.2, ఎగ్జిట్ నంబర్ 4 సుల్తాన్‌పూర్ నుంచి అంగడిపేట 24.7 కి.మీ, ఎగ్జిట్ నంబర్ 2 కొల్లూరు నుంచి పులిమామిడి 27.6 కి.మీ, ఎగ్జిట్ నరంబర్ 15 పెద్ద గోల్కొండ నుంచి బూర్గుల్ 31 కి.మీ, ఎగ్జిట్ నంబర్ 15 పెద్ద గోల్కొండ నుంచి కేశంపేట్, 30.6 కి.మీ, ఎగ్జిట్ నంబర్ 15 పెద్ద గోల్కొండ నుంచి తలకొండపల్లి 34 కి.మీ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు.

ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్

ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ ఉన్న గ్రోత్ కారిడార్ ఏరియా హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఓఆర్ఆర్ 158 కిలోమీటర్ల పొడవైన 8-లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే. దీనికి ఇరువైపులా కిలోమీటర్ ఏరియా పరిధిని గ్రోత్ కారిడార్‌గా నిర్ణయించారు. ఈ కిలోమీటర్ పరిధిలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి హెచ్‌ఎండీఏ ప్రత్యేక నిబంధనలతో ఈ జోన్లను ఏర్పాటు చేసింది. వాటిలో గచ్చిబౌలి / కోకాపేట ఏరియాను ఐటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గాను శంషాబాద్‌ను అంతర్జాతీయ విమానాశ్రయం, కూకట్‌పల్లి / మియాపూర్‌ను నివాస, వాణిజ్య కేంద్రాలుగాను ఏర్పాటు చేశారు. దీంతోపాటు మేడ్చల్ / శామీర్‌పేట ప్రాంతాలను లాజిస్టిక్స్, పరిశ్రమల కేంద్రంగా ఏర్పాటు చేశారు. పటాన్‌చెరు / శంకర్‌పల్లి ప్రాంతాలను నివాస, పారిశ్రామిక ఏరియాగా గుర్తించారు. అయితే ఈ గ్రోత్ కారిడార్లను అనుసంధానం చేసేందుకు మెట్రోరైలుతోపాటు 33 రేడియల్ రోడ్లను నిర్మించారు. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

2 కి.మీ చొప్పున

ఓఆర్ఆర్ 158 కిలోమీటర్ల మార్గంలో విస్తరించి ఉన్నది. దీనికి ఇరువైపులా కిలోమీటర్ చొప్పున గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేశారు. అంటే 316 కిలోమీటర్ల గ్రోత్ కారిడార్ పరిధిలో జోన్ల ఆధారంగా ఇన్‌ఫాక్ట్ ఫీజు వసూలు చేశారు. దీంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనతోపాటు ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ ఇరువైపులా మరో కిలోమీటర్ పెంచాలని నిర్ణయించారు. మొత్తం 632 చదరపు కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయించారు. అంటే జీహెచ్ఎంసీ పరిధి 625 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నది. దీనికి అనుసంధానంగా మరో నగరాన్ని నిర్మించడానికి అధికారులు సూచించారు. కానీ ఈ ప్రణాళికను ఆచరణలో పెట్టలేకపోయారని అధికారులు చెబుతున్నారు.

గ్రీన్ ఫీల్డ్ గ్రోత్ కారిడార్

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించనున్న సుమారు 328 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల మార్గంలో గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోడ్లకు ఇరువైపులా 300 మీటర్ల చొప్పున అంటే 600 మీటర్ల మార్గంలో గ్రోత్ కారిడార్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 328 కి.మీ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల పరిధిలో 196 కిలోమీటర్ల గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. వీటి పరిధిలో మొదటి 100 మీటర్లకు ఒక రకమైన ఫీజు, 100 నుంచి 200 మీటర్లకు, 200 నుంచి 300 మీటర్లకు ఇలా మూడు రకాల ఇన్‌ఫాక్ట్ ఫీజులను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫీజుల వసూళ్లపై హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Next Story