- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: 66 ఎకరాలుండేది.. 30 ఎకరాలైంది
పార్కు స్థలం ఉంది.. స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ప్రాణవాయువు అందుతుంది అనుకుంటే వాటినే రకరకాల పేరుతో మాయం చేస్తున్నారని పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పార్కు స్థలం ఉంది.. స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ప్రాణవాయువు అందుతుంది అనుకుంటే వాటినే రకరకాల పేరుతో మాయం చేస్తున్నారని పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. లే ఔట్ వేసినప్పుడే పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను ఆయా అథారిటీలకు గిఫ్ట్ డీడ్ చేసినా తర్వాత అవి ప్లాట్లుగా మారిపోతున్నాయని పలువురు వాపోయారు. లే ఔట్‌లో ఓపెన్ బావిగా ఉన్న ప్రాంతాన్ని తర్వాత మట్టితో నింపేసి బై నంబర్లు వేసి ప్లాట్లుగా అమ్మేస్తున్నారని, పాతబస్తీ లాల్‌దర్వాజాలో ఒకప్పుడు గ్రామకంఠంగా ఉన్న 2 ఎకరాలు కబ్జాకు గురయ్యిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్‌లోని హస్మత్‌పేట బోయిన్ చెరువు 66 ఎకరాలుండేదని.. ఇప్పుడు 30 ఎకరాలే మిగిలిందని.. కబ్జాలను నియంత్రించి చెరువును కాపాడాలని నివాసితులు కోరారు. ఇలా సోమవారం హైడ్రా ప్రజావాణికి 59 ఫిర్యాదులందగా వాటిని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ పరిశీలించి.. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. కొన్ని ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి త్వరలోనే వస్తామని కమిషనర్ చెప్పారు. గతంలో హైడ్రాకు ఫిర్యాదు చేయగా.. మా పార్కును కాపాడారంటూ పలువురు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై కృతజ్ఞతలు తెలిపారు. పార్కును కాపాడుకున్నారంటూ తిరిగి వారినే శాలువతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సన్మానించారు.
సీఎంసీ ప్రజావాణికి 43 ఆర్జీలు..
మాదాపూర్‌లోని సీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 43 విన్నపాలు, ఫిర్యాదులు ప్రజల నుంచి అందాయి. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను అదనపు కమిషనర్‌లు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్‌లు, విభాగాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణికి 59 అర్జీలు వచ్చాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 42 విన్నపాలు, ఫిర్యాదులు రాగా ఆరు జోన్ల పరిధిలో 17 అర్జీలు వచ్చాయి. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కే.సత్యనారాయణ, ఏఎస్పీ నరసింహా రెడ్డి, జాయింట్ కమిషనర్‌లు జయంత్, రజినీకాంత్ రెడ్డి, సిటీ ప్లానర్ ఉమ తదితరులు పాల్గొన్నారు.






