HYD: పైనా హాస్టళ్లు..సెల్లార్లలో హోటళ్లు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-16 15:35:57  IST  )

సోమ‌వారం ప్ర‌జావాణికి వ‌చ్చిన 59 ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ నేరుగా ప‌రిశీలించి ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

HYD: పైనా హాస్టళ్లు..సెల్లార్లలో హోటళ్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మాదాపూర్ ప్రాంతంలో పైన హాస్ట‌ళ్లు నిర్వ‌హించి.. గ్రౌండ్ ఫ్లోర్‌లో హోట‌ళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌సెంట‌ర్లు, క్యాంటిన్లు న‌డుపుతున్నార‌ని, ప్ర‌మాదం జ‌రిగితే ఆ న‌ష్టాన్ని ఊహించ‌డం క‌ష్ట‌మే’ అని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ‘వ‌స్త్ర దుకాణ‌దారులు, ఫ‌ర్నీచ‌ర్ షాపుల వారే కాదు.. నివాస ప్రాంతాల మ‌ధ్య వాణిజ్య కార్య‌కాలాపాలు నిర్వ‌హిస్తున్న భ‌వ‌నాలు కూడా అగ్ని ప్ర‌మాదానికి ఆస్కారంగా ఉన్నాయి’ అని జూబ్లీహిల్స్ రోడ్డు నంబ‌రు 44 ఏరియాకు చెందిన మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా హైడ్రా ప్రజావానికి 59 ఫిర్యాదులు వచ్చాయి.

చెరువులు, నాలాలు, ర‌హ‌దారులు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల క‌బ్జాల‌పై హైడ్రా ప్ర‌జావాణికి ప్ర‌తి సోమ‌వారం వ‌చ్చే ఫిర్యాదుల‌కు అగ్ని ప్ర‌మాదాల‌కు సంబంధించిన‌వి కూడా తోడ‌య్యాయి. నివాసాల‌కు చేరువ‌లో ప్లాస్టిక్‌, స్క్రాప్ దుకాణాలున్నాయ‌ని, పైన వ‌స‌తి గృహాలు.. కింద‌న హోట‌ళ్లు నిర్వ‌హిస్తున్నార‌ని, సెల్లార్ల‌లో అగ్ని ప్ర‌మాదానికి ఆస్కారం ఉండే వ‌స్తువుల‌ను నిలువ చేస్తున్నార‌ని ప‌లువురు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. వెంట‌నే త‌నిఖీలు చేసి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైడ్రాను కోరారు. వీటికి తోడు ప‌లు కాల‌నీల్లో పార్కులు, ర‌హ‌దారులు క‌బ్జాకుగుర‌య్య‌య‌నే ఫిర్యాదులు కూడా అందాయి. సోమ‌వారం ప్ర‌జావాణికి వ‌చ్చిన 59 ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ నేరుగా ప‌రిశీలించి ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

Next Story