Hydra Prajavani: 200 ఏళ్ల నాటి చింత‌బాయి క‌బ్జా.. హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు

by Ramesh Naini |   (  Updated:2026-01-05 12:35:09  IST  )

చెరువులే కాదు.. ఊట బావుల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. గ‌తంలో వంద‌లు, వేలాదిమందికి తాగునీరందించిన ఓపెన్ బావుల‌ను నేటి ప్ర‌భుద్ధులు పూడ్చేసి ప్లాట్లుగా చేసి విక్ర‌యించేస్తున్నారు.

Hydra Prajavani: 200 ఏళ్ల నాటి చింత‌బాయి క‌బ్జా.. హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చెరువులే కాదు.. ఊట బావుల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. గ‌తంలో వంద‌లు, వేలాదిమందికి తాగునీరందించిన ఓపెన్ బావుల‌ను నేటి ప్ర‌భుద్ధులు పూడ్చేసి ప్లాట్లుగా చేసి విక్ర‌యించేస్తున్నారు. న‌గ‌రంలో ఇలా అనేక ఓపెన్ బావులు క‌నుమ‌రుగ‌వ్వ‌గా.. తాజాగా అల్వాల్‌లో స‌జీవంగా ఉన్న దానిపై క‌బ్జారాయుళ్ల క‌న్ను ప‌డింది. 200 ఏళ్ల ఓపెన్ బావిని కాపాడి.. చారిత్ర‌క ఆన‌వాళ్ల‌ను ప‌రిర‌క్షించాలంటూ వెన్‌రాక్ ఎన్‌క్లేవ్ నివాసితులు హైడ్రా ప్ర‌జావాణికి వ‌చ్చి విన్న‌వించారు. పార్కులు, ర‌హ‌దారులు ఇలా అనేకం ఆక్ర‌మ‌ణ‌లై శాశ్వ‌త భ‌వ‌నాలు వ‌చ్చేయ‌గా.. హైడ్రా వ‌చ్చిన త‌ర్వాత చాలా పార్కుల‌కు ప్రాణం పోసారంటూ ప‌లువురు అభినందిస్తున్నారు. త‌మ పార్కుల‌ను కూడా కాపాడి ప్రాణ‌వాయువు అందించాల‌ని విన‌తిప‌త్రాలు అంద‌జేస్తున్నారు. ఇలా సోమ‌వారం హైడ్రా ప్రజావాణికి 32 ఫిర్యాదులు అందాయి. వీటిని హైడ్రా అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌. సుద‌ర్శ‌న్ ప‌రిశీలించి.. సంబంధిత అధికారుల‌కు ప‌రిష్కార బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఫిర్యాదులు ఇలా...

మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అల్వాల్ లోని వెన్‌రాగ్‌ ఎన్‌క్లేవ్‌లో చారిత్రక ఊటబావిని కొంతమంది క‌బ్జా చేయడానికి ప్రయతిస్తున్నారని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 200 ఏళ్ల చరిత్ర ఉన్న చింత‌బాయి ఓపెన్ బావి ఎంతో మందికి తగునీరందించిందని.. దానిని కాపాడాలని కోరారు. వెన్‌రాగ్ ఎన్‌క్లేవ్ లే ఔట్ వేసిన‌ప్పుడు ఓపెన్ స్పేస్‌గా చూపించార‌ని పేర్కొన్నారు. ఇప్పుడ‌దే క‌బ్జా అవుతోంద‌ని దానిని కాపాడాల‌ని వ‌న‌తిప‌త్రం అంద‌జేశారు. రంగారెడ్డి జిల్లా స‌రూర్‌న‌గ‌ర్ మండ‌లం ఆర్‌కే పురం డివిజ‌న్‌లోని గ్రీన్‌హిల్స్ కాల‌నీలో 6087 గ‌జాల ఓపెన్‌స్పేస్ వ‌దిలిపెట్టారు. ఇప్ప‌టికే కొంత స్థ‌లం క‌బ్జాకు గుర‌య్యింద‌ని.. వెంట‌నే స‌ర్వే జ‌రిపించి రికార్డుల ప్ర‌కారం ఉన్న భూమిని కాపాడి.. మా కాల‌నీకి మంచి పార్కును నిర్మించాల‌ని అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.

ఖాజాగూడ‌లో వెయ్యి గ‌జాల వ‌ర‌కూ క‌బ్జా!

మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా నిజాంపేట స‌ర్కిల్ ప‌రిధిలోని చిల్డ్రెన్ పార్కు ద‌గ్గ‌ర‌లోని మురుగునీరు, వ‌ర‌ద‌నీటి కాలువ‌ను ఇష్టానుసారం మార్చేస్తున్నార‌ని.. గ‌తంలో ఎలా ప్ర‌వ‌హించేదో అలాగే ఉంచాల‌ని కౌశ‌ల్యా కాల‌నీ వాసులు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. వారి రియ‌ల్ ఎస్టేట్ సామ్రాజ్యాల‌కు అనువుగా కాలువ‌ను తిప్పి వ‌ర‌ద సాఫీగా సాగేందుకు అవ‌కాశం లేకుండా మారుస్తున్నార‌ని.. వెంట‌నే క‌లుగ చేసుకుని గ‌తంలో మాదిరి వ‌ర‌ద సాగేలా చూడాల‌ని కోరారు. ఐటీ హ‌బ్‌కు చేరువ‌లో అత్యంత విలువైన ఖాజాగూడ‌లో ఉన్న ఖాజాగూడ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని వెయ్యి గ‌జాల వ‌ర‌కూ క‌బ్జాచేసేశార‌ని హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదు చేశారు. దీనిని 250 గ‌జాల చొప్పున 4 ఫ్లాట్లుగా చేసి ఇంటి నంబ‌ర్లు కూడా తెచ్చుకున్నార‌ని.. హైడ్రా రంగంలోకి దిగి ఖాజాగూడ పెద్ద‌చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిని ర‌క్షించాల‌ని కోరారు.

Next Story