దెబ్బతిన్న 17 మోటార్లు.. కాళేశ్వరం పరిస్థితి ఏంటి?

by Disha Web Desk 4 |
దెబ్బతిన్న 17 మోటార్లు..  కాళేశ్వరం పరిస్థితి ఏంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు కకావికలమైంది. మొన్నటిదాకా అంతర్జాతీయ మీడియాకెక్కిన బాహుబలి మోటర్లు.. ఇప్పుడు బురదలో కూరుకుపోయాయి. కన్నెపల్లి పంప్​ హౌస్​ లోని 17 మోటర్లూ దెబ్బతిన్నట్లు ఇంజినీర్లు గుర్తించారు. వీటిలో ఆరు మోటర్లు ఏకంగా స్థానభంశం చెందడమే కాకుండా.. తిరిగి పని చేయలేని విధంగా దెబ్బతిన్నాయి. మరో మూడు మోటర్లపై క్రేన్లు, సిమెంట్​ దిమ్మెలు పడటంతో.. అవి చేస్తాయా..? లేదా? అనేది సందేహంగా మారింది. ఇక మొన్నటిదాకా కేవలం రూ. 20 కోట్లు మాత్రమే నష్టపోయామంటూ లెక్కలేసి చెప్పిన ఇరిగేషన్​ అధికారులు.. ఇప్పుడేం చెప్పాలో తెలియక ముఖం చాటేస్తున్నారు. దీనికి తోడుగా క్రేన్లు కూలడం, నిర్మాణ స్థలాలు దెబ్బతినడంతో పాటుగా కొన్ని భాగాలు విరిగిపోయాయి. 220 టన్నుల క్రేన్లు మోటర్లపై పడటంతో.. వాటిని నిర్మించిన స్థానాల నుంచి పక్కకు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇది వరదలతో కాకుండా ఇతర ప్రమాదాలతో మోటర్లకు నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఇన్సురెన్స్​ వర్తించడం కష్టమేనని ఇంజినీర్లు చెప్తున్నారు.

గ్రావిటీ కాల్వకు దెబ్బ

గోదావరి వరదలతో కాళేశ్వరం బాహుబలి మోటర్లు మునగడమే కాదు.. కాళేశ్వరం గ్రావిటీ కాల్వ దెబ్బతింది. రెండువైపులా కాంక్రీట్​ తో నిర్మించిన గ్రావిటీ కాల్వ దెబ్బతినడంతో నిర్మాణ లోపాలు బయట పడుతున్నాయి. లక్ష్మీ పంప్​ హౌస్​ నుంచి సరస్వతి బ్యారేజీ వరకు మొత్తం 13.5 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వ నిర్మాణం చేయగా.. వరదలు వచ్చిన నేపథ్యంలో ఆరో కిలోమీటరు దగ్గర గ్రావిటీ కాల్వ కాంక్రీట్​ లైనింగ్​, ఆ తర్వాత 7వ కిలోమీటరు, 11వ కిలోమీటర్​ దగ్గర కాంక్రీట్​ లైనింగ్స్​ పగిలిపోయాయి. ఒక్కొచోట 300 మీటర్ల మేర కాంక్రీట్​ గోడ దెబ్బతింది.

మహారాష్ట్ర కూలీలకు మాత్రమే!

కాళేశ్వరం ప్రాజెక్టుకు మొన్నటి వరకు పర్యాటకులను అనుమతించిన ప్రభుత్వం.. ఇప్పుడు అటువైపు వెళ్లకుండా ఆంక్షలు పెట్టింది. ఇటీవల అదే సెగ్మెంట్​కు చెందిన ఎమ్మెల్యే శ్రీధర్​ బాబును సైతం అక్కడకు అనుమతించలేదు. సీఎల్పీ బృందం అటు వెళ్తామంటే ఇంకా అనుమతి రావడం లేదు. కాళేశ్వరాన్ని టూరిజం స్పాట్​ గా చేసేందుకు నిధులు కేటాయించిన సర్కారు.. ఇప్పుడు నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. ప్రస్తుతం మరమ్మత్తు పనులు చేసేందుకు స్థానికులను కాకుండా.. మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకువచ్చారు. కాళేశ్వరం నిర్మాణ ప్రాంతంలో ఇప్పుడు మహారాష్ట్ర కూలీలు కాకుండా మరెవ్వరూ కనిపించడం లేదు. అక్కడ పనిచేసే వారి ఫోన్లను సైతం తీసుకుంటున్నారు.

9 మోటార్లు కష్టమే

కాళేశ్వరం అద్భుతం అంటూ చెప్పుకునే టీఆర్​ఎస్​ సర్కారు.. ఇప్పుడు సందిగ్థంలో పడింది. బాహుబలి మోటర్లు 17 ఏర్పాటు చేయగా.. వాటిలో ఎన్ని పని చేస్తాయో తేలడం లేదు. ఇప్పటి వరకు నీటిని తోడటమే పూర్తి కావడం లేదు. భారీ పంపులతో నీటిని బయటకు తీస్తున్నారు. అయితే, మొత్తం బురద వీడటం లేదు. మరోవైపు నిర్మాణాలు, ఈవోటీ క్రేన్లు కూలిపోవడంతో ఆ ప్రాంతానికి వెళ్లాలంటే జంకుతున్నారు. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు లేకుండా లోనికి వెళ్లలేమంటూ ఇంజినీర్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా 9 మోటర్లు పని చేయడం కష్టమేనని అంచనా వేస్తున్నారు. 220 టన్నుల ఈవోటీ క్రేన్లు, ఇతర సిమెంట్​ దిమ్మెలు వంటివి మోటర్లపై పడ్డాయి. అటు వరదలు, ఇటు భారీ కట్టడాలు మీద పడటంతో ఈ 9 మోటర్లు బిగించిన ప్రాంతం నుంచి పక్కకు జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా కొన్ని మోటర్ల పైభాగాలు మొత్తం విరిగిపోయి, సేఫ్టీ బాగాలు దెబ్బతిని, అవి కూడా పక్కకు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కొన్ని మోటర్లను పైనుంచి చేస్తూనే పూర్తిగా వంగిపోయినట్లుగా ఉన్నాయని ఇంజినీర్లు చెప్తున్నారు. మోటర్ల ప్రాంతంలో పెద్ద కట్టర్లతో లింకులను కట్​ చేస్తున్నారు. మోటర్ల ప్రాంతాలని వెళ్లే రెండు లిఫ్ట్​ లు మొత్తం ధ్వంసం అయ్యాయి.

రూ. 800 కోట్లు ఎలా..?

ప్రస్తుతం కాళేశ్వరంలోని బాహుబలి మోటర్లు 6 మొత్తంగా పని చేయకుండా మారగా.. మరో మూడు మోటర్లు కూడా భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. వీటిలో కనీసం ఆరు మోటర్లను మార్చాల్సిందేనని ఇరిగేషన్​ శాఖ ప్రాథమికంగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. వాటి వైండింగ్​, ఇతర పార్టులు మరమ్మత్తు చేయడం కంటే.. కొత్తవి ఏర్పాటు చేయడమే మెరుగని సూచించినట్లు తెలుస్తోంది. మిగిలిన మూడింటిని మరమ్మత్తు చేసే చాన్స్​ ఉందని ప్రాథమిక నివేదికను ఇచ్చినట్లు చెప్తున్నారు. వీటికోసం రూ. 800 కోట్లు ఖర్చు అయ్యే అవకాశాలున్నాయని, వరదలతో కాకుండా నిర్మాణాలు కూలడం, భారీ క్రేన్లు తెగిపడటంతో ఇన్సురెన్స్​ వచ్చే అవకాశం లేదని ఇంజినీర్లు సూచించారు.

పరిశీలన తర్వాతే తుది రిపోర్ట్​

మోటర్లు మునిగిన ప్రాంతాలను క్లీన్​ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రాథమిక నివేదిక మాత్రమే ఇచ్చారు. ఈఎన్సీ ఆధ్వర్యంలోని ఇంజినీర్ల బృందం మోటర్లను తుది పరిశీలన చేసిన తర్వాతే పూర్తిస్థాయి నివేదిక ఇస్తారని అధికారులు చెప్తున్నారు. కాగా, మరోసారి గోదావరి నదీ యాజమాన్య బోర్డు గురువారం కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా వరద ప్రాంతాల్లో పర్యటించింది. మేడిగడ్డ, అన్నారం ప్రాంతాల్లో మునిగిన పంప్​ హౌస్​ లను పరిశీలించారు. ఇప్పటికే సీడబ్ల్యూసీ బృందం కూడా పరిశీలించిన వెళ్లిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed