లేక్ వ్యూ పార్క్‌లో 16 అడుగుల ఎత్తులో పూలే విగ్రహాలు

by Malleboina Mahesh |

హైదరాబాద్ లేక్ వ్యూ పార్క్‌లో ఫూలే దంపతుల 16 అడుగుల విగ్రహాల ఏర్పాటు. ఏప్రిల్ 11న ఆవిష్కరణ. పనులను పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ.

లేక్ వ్యూ పార్క్‌లో 16 అడుగుల ఎత్తులో పూలే విగ్రహాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏప్రిల్ 11, 2026న నిర్వహించనున్న మహా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని, పీవీఎన్‌ఆర్ మార్గ్‌లోని లేక్ వ్యూ పార్క్‌లో ఏర్పాటు చేస్తున్న మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాల ఏర్పాట్లను మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ బీసీ నాయకులు మంగళవారం సమగ్రంగా పరిశీలించారు.

16 అడుగుల విగ్రహాలు..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ఫూలే దంపతుల జ్ఞాపకార్థంగా ప్రజలకు అవగాహన కలిగించేలా ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2,105 చదరపు మీటర్ల స్థలంలో 16 అడుగుల ఎత్తులో రెండు విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. పీఠం, రిటైనింగ్ గోడలు, ఎంఎస్ రైలింగ్ పనులు పూర్తయ్యాయి. తుది దశలో ల్యాండ్‌స్కేపింగ్, విద్యుత్ పనులు కొనసాగుతున్నాయి. కొత్త రోడ్డు లేన్, ఫుట్‌పాత్‌లు, కూర్చునే బెంచీలు మరియు శిల్పాలతో ఈ ప్రదేశాన్ని ప్రజలకు అనుకూలంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మంత్రుల ఆధ్వర్యంలో పరిశీలన..

విగ్రహాల పనులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్,కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బీర్ల అయిలయ్య, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, మాజీ రాజ్యసభ సభ్యులు, వి. హనుమంతరావు పరిశీలించినవారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, బీసీ సంక్షేమ కమిషనర్ బాల మాయాదేవి, తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి బి. సైదులు, హైదరాబాద్ కలెక్టర్ డి. హరిచందన, హెచ్ఎండీఏ జేఎంసీ వెంకన్న, చీఫ్ ఇంజినీర్ బి.రవీందర్, అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ చక్రపాణి పాల్గొన్నారు.

Next Story