- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలస్యమైతే వడ్డీ చెల్లించాల్సిందే.. బిల్డర్లకు హైకోర్టు వార్నింగ్
ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. దాన్ని నెరవేర్చుకునేందుకు జీవిత కాలం కష్టపడుతుంటారు. ఏండ్ల తరబడి కూడబెట్టిన సొమ్మునంతా బిల్డర్ల చేతిలో పెట్టి ఎదురుచూస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. దాన్ని నెరవేర్చుకునేందుకు జీవిత కాలం కష్టపడుతుంటారు. ఏండ్ల తరబడి కూడబెట్టిన సొమ్మునంతా బిల్డర్ల చేతిలో పెట్టి ఎదురుచూస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఐతే ఫ్లాట్ల కోసం ఎదురుచూసే వారికి మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. కొనుగోలుదారులందరికీ ఓ వరంగా నిలుస్తుంది. రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం (రెరా) కింద ఒప్పందం ప్రకారం నిర్ణీత సమయానికి ఫ్లాట్ అప్పగించడంలో విఫలమైతే బిల్డర్ కొనుగోలుదారునికి ‘ప్రతి నెలా వడ్డీ’ చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. కొనుగోలుదారుడు, డెవలపర్ల మధ్య అగ్రిమెంట్‌లో ఎలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ ఈ షరతు వర్తిస్తుంది. రెరా చట్టం సెక్షన్ 18 ప్రకారం వినియోగదారుల ప్రయోజనాలు కాపాడాల్సిందేనని తెలిపింది. ముంబై ములుండ్ ప్రాంతంలోని ‘రన్వాల్ ఇన్ఫినిటీ (రన్వాల్ శాంక్చురీ)’ ప్రాజెక్టులో 2005 - 2007 మధ్య కాలంలో కొందరు కస్టమర్లు ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు. బిల్డర్ ఒప్పందం ప్రకారం 2008 - 2010 నాటికే వీరికి ఫ్లాట్లను అప్పగించాల్సి ఉంది. కొందరు కస్టమర్లు ఇంటికి సంబంధించిన పూర్తి మొత్తాన్ని చెల్లించినప్పటికీ బిల్డర్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా దాదాపు రెండు దశాబ్దాల (20 ఏళ్లు) పాటు కాలయాపన చేస్తూ వచ్చాడు. దీనిపై బాధితులు మహారాష్ట్ర రెరాను ఆశ్రయించగా బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ బిల్డర్ హైకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ మాధవ్ జామదార్ బిల్డర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
డబ్బులు కలెక్ట్ చేసి..
రియల్ ఎస్టేట్ సంస్థల యజమానులు కొనుగోలుదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇండ్లను అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారు. పైగా కట్టిన సొమ్మును వారి దగ్గరే ఉంచుకుంటున్నారు. ఇది సరైంది కాదు. బిల్డర్లు కస్టమర్లతో చేసుకునే సేల్ అగ్రిమెంట్లలో తాము సేఫ్‌గా ఉండేందుకు నిబంధనలు రాసుకుంటారు. ఐతే రెరా చట్టం ప్రకారం కస్టమర్‌కు లభించే ‘ఆలస్యపు వడ్డీ’ హక్కును అగ్రిమెంట్‌లోని ఏ క్లాజ్ కూడా కాలరాయలేదని కోర్టు స్పష్టం చేసింది. 2014 ఫిబ్రవరి 1 నుంచి అసలు ఫ్లాట్ చేతికి వచ్చేంత వరకు కస్టమర్లు చెల్లించిన ప్రతి రూపాయిపై ఏడాదికి 10.05 శాతం చొప్పున నెలవారీ వడ్డీని లెక్కగట్టి కస్టమర్లకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కస్టమర్లను ఇబ్బంది పెట్టినందుకు అదనపు జరిమానా విధించింది. 10 అప్పీళ్లలో రెండు ప్రధాన కేసులకు రూ. లక్ష చొప్పున, మిగిలిన ఎనిమిది కేసులకు రూ.10 వేల వంతున కోర్టు ఖర్చులను బాధితులకు చెల్లించాలని స్పష్టం చేసింది.
సంచలన తీర్పు
ముంబై హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశ వ్యాప్తంగా సంచలనమే. అన్ని రాష్ట్రాల్లోని కస్టమర్లకు ఉపయోడపడేదే. రెరా చట్టం అమలులో ఉన్న అన్ని రాష్ట్రాల వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ ఆలస్యమైనా కస్టమర్ ఆ ప్రాజెక్ట్ లోనే కొనసాగాలని అనుకుంటే.. బిల్డర్ డిఫాల్ట్ అయిన తేదీ నుంచి ఇల్లు ఇచ్చేంత వరకు ప్రతి నెలా వడ్డీ పొందవచ్చు. ప్రాజెక్ట్ విపరీతంగా ఆలస్యమైతే కస్టమర్ తన బుకింగ్‌ను రద్దు చేసుకుని.. కట్టిన మొత్తం సొమ్మును వడ్డీతో సహా వెనక్కి తీసుకోవచ్చు. ఇటీవల వచ్చిన కొన్ని కీలక తీర్పుల ప్రకారం ఒకవేళ కస్టమర్ ఆలస్యంగానైనా ఫ్లాట్ పొసెషన్ తీసుకున్న తర్వాత కూడా జరిగిన ఆలస్యానికి గానూ రెరా అథారిటీ ద్వారా వడ్డీని క్లెయిమ్ చేయవచ్చు.
కొనుగోలుదారులకు భారం
ప్రాజెక్టు జాప్యం కావడం వల్ల కస్టమర్‌కు చాలా నష్టం జరుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వైపు ఉంటున్న ఇంటికి కిరాయి కట్టాలి. అలాగే మరోవైపు కొన్న ఇంటి పొషిషన్ దక్కకపోయినా బ్యాంకు రుణానికి ఈఎంఐ పే చేయాలి. కాబట్టి రెట్టింపు భారాన్ని మోయాల్సి వస్తుంది. ఇంటిని పెట్టుబడిగా భావించిన వారికి కూడా తీవ్ర నష్టమే. సమయానికి ఇల్లు చేతికి అందకపోవడం వల్ల కిరాయిల రూపంలో వచ్చే అమౌంట్ లాస్. బిల్డర్ గడువులోపు ఇవ్వకపోవడం వల్ల మార్కెట్‌లో ఆ ఇంటి ఖరీదుపైనా ప్రభావం పడుతుంది. అన్నింటికీ మించి మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. ఇల్లు మార్చాల్సి వస్తే చేపట్టాల్సిన స్కూల్ మార్పిడి, కుటుంబ సభ్యుల నివాసం, హాస్పిటల్ చెకప్‌లు వంటి వాటిపైనా ఎఫెక్ట్ పడుతుంది.
బిల్డర్ పొరపాటు ఎక్కడ?
చాలా మంది బిల్డర్లు కస్టమర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఆ అమౌంట్‌ను అదే ప్రాజెక్టుకు ఖర్చు చేయకుండా కొత్తగా భూములు కొనేందుకు వినియోగిస్తుంటారు. దాంతో ఈ ప్రాజెక్టు నత్తనడక నడవడమో, మొత్తానికే నిలిచిపోవడమో అనివార్యమవుతుంది. సరైన పత్రాలు సమర్పించకపోవడం వల్ల అనుమతులు ఆలస్యంగా వస్తాయి. సిమెంట్, స్టీలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. అగ్రిమెంట్ ప్రకారం గడువు దాటిందంటే కస్టమర్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకునే హక్కు ఉంది. అలాగే మొత్తం సొమ్మును వడ్డీతో సహా బిల్డర్ కట్టాలి. ఫిర్యాదు చేసిన 45 రోజుల్లోనే సర్దుబాటు చేయాలి. కస్టమర్ ప్రాజెక్టులో కొనసాగితే.. ప్రతి నెలా కట్టిన సొమ్ముపై వడ్డీ కట్టాలి. ఇలా అనేక కారణాలతో ప్రాజెక్టును జాప్యం చేయడం వల్ల డెవలపర్ కూడా ఇబ్బందుల్లో పడుతారు.






