Dial 112: ఇక 108 మర్చిపోండి.. ఎనీ ఎమర్జెన్సీ అమల్లోకి కొత్త నంబర్

by Prasad Jukanti |   (  Updated:2025-06-21 13:10:09  IST  )

డయల్ 100,108,101,1077 వంటి ఎమర్జెన్సీ నంబర్లు కనుమరుగు కాబోతున్నాయి.

Dial 112: ఇక 108 మర్చిపోండి.. ఎనీ ఎమర్జెన్సీ అమల్లోకి కొత్త నంబర్
X

దిశ, డైనమిక్ బ్యూరో/సిటీ క్రైమ్ : అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, బాధితులు సహాయం కోసం చేసే టోల్ ఫ్రీ నంబర్ల విషయంలో కీలక మార్పులు జరిగాయి. ఇకపై ఎమర్జెన్సీ సేవలన్నింటికీ ‘డయల్ 112’ (Dial 112) నంబర్‌ అమలులోకి వచ్చినట్లు డీజీపీ జితేందర్ (DGP Jitender) తెలిపారు. ఇప్పటివరకు పోలీస్ సహాయం కోసం 100, అంబులెన్స్ సేవల కోసం 108, మహిళల భద్రత 181, చిన్నారుల భద్రత 1098, విపత్తులకు సంబంధించి 1077 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందేవారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలోనే 112 నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో నేటి నుంచి రాష్ట్రంలో ఇదివరకు ఉన్న ఎమర్జెన్సీ నంబర్ల స్థానంలో 112 ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

జీపీఎస్ ద్వారా ట్రాక్..

ఇదివరకు ఉన్న ఎమర్జెన్సీ నెంబర్లను టీజీఈఆర్ఎస్ఎస్‌కు అనుసంధానం చేశారు. దీంతో 112కు డయల్ చేయగానే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి వెంటనే సంఘటన స్థలానికి అధికారులను పంపించేలా ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్యానిక్ బటన్‌ను గట్టిగా నొక్కినా 112కు కాల్ వెళ్లనుంది. ఈ మార్పులను గమనించి ప్రజలు సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story