రూ.100 కోట్ల సీలింగ్ ల్యాండ్‌కు సైలెంట్‌గా క్లియరెన్స్.. ఇంతకు ఆ రిపోర్ట్ ఇచ్చిందెవరు..?

by Disha Web Desk 19 |
రూ.100 కోట్ల సీలింగ్ ల్యాండ్‌కు సైలెంట్‌గా క్లియరెన్స్.. ఇంతకు ఆ రిపోర్ట్ ఇచ్చిందెవరు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ.100 కోట్ల భూమికి క్లియరెన్స్ ఎవరిచ్చారు? ఏ ఆధారాలతో ఇచ్చారు? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో సీలింగ్ సర్ ప్లస్ నుంచి పట్టా భూమిగా మారిన పదెకరాలపై అంతా సైలెంట్ అయ్యారు. మాకైతే తెలియదు.. మేం ఏ పాపం ఎరుగం అని స్థానిక రెవెన్యూ అధికారులు అంటున్నారు.

ఏ తహశీల్దార్ నివేదిక ఆధారంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ క్లియరెన్స్ ఇచ్చారు? అసలు తహశీల్దార్ నుంచి రిపోర్ట్ కలెక్టరేట్‌కి చేరిందా? ఎలాంటి రిపోర్టు లేకుండానే కలెక్టర్ ఏకపక్షంగా పట్టాగా మార్చేశారా? అన్న సందేహాలు మొదలయ్యాయి. కలెక్టర్‌కు గ్రేట్ ధరణి పోర్టల్ ద్వారా సంక్రమించిన ధరణి డేటా మోడిఫికేషన్ సిస్టం(డీడీఎంఎస్) అధికారం ద్వారా దశాబ్దాలుగా కొనసాగుతున్న క్లాసిఫికేషన్‌ని పట్టా భూములుగా మార్చారు.

దాంట్లో భాగంగానే ఆదిభట్లలో సీలింగ్ సర్ ప్లస్ భూములకు క్లియరెన్స్ ఇచ్చారు. రూ.100 కోట్ల విలువైన భూమికి క్లియరెన్స్ ఇచ్చారు. సర్వే నం.44 లో 10 ఎకరాలను పట్టాగా మార్చారు. అలాగే ధరణి పోర్టల్‌లో మార్చారు. కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రికార్డుల్లో నేటికీ సీలింగ్ సర్ ప్లస్ గానే ఉన్నది. కేవలం ఈ పదెకరాలపై బీఆర్ఎస్ లీడర్లు క్రయ విక్రయాలకు పాల్పడడంతోనే సాధ్యమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే మిగతా సర్వే నంబర్లలోని సీలింగ్ భూమికి క్లియరెన్స్ ఇవ్వలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిభట్లలోని ఈ భూమికి పక్కనే అనేక సర్వే నంబర్లలో సీలింగ్ భూములు ఉన్నాయి. అలాగే కొంచెం దూరంలోనే అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజాల్ పరిధిలోనూ వందలాది ఎకరాలు ఉన్నాయి. ఈ భూముల్లో దశాబ్దాల క్రితమే వెంచర్లు అయ్యాయి. ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడీ సీలింగ్ భూముల పరేషాన్‌తో ఇబ్బంది పడుతున్నారు. వాళ్లు కూడా ఎన్నో ఏండ్లుగా క్లియరెన్స్ ఇవ్వాలని పోరాడుతున్నారు. మరి వాళ్ల విజ్ఞప్తులేవీ పట్టించుకోకుండా కేవలం ఈ 10 ఎకరాలకు మాత్రమే డేటా ఎందుకు మార్చారన్న చర్చ నడుస్తున్నది.

ఆర్డర్ కాపీ ఏది?

ఆదిభట్ల సర్వే నం.44లో 10 ఎకరాల భూమి సీలింగ్ సర్ ప్లస్ నుంచి పట్టాకు మారింది. ఐతే ఏ ఆర్డర్ కాపీ తహశీల్దార్ కార్యాలయంలో లేదు. ఏ నివేదిక ప్రకారం డేటా మార్చారో, ఏ సర్క్యూలర్ ప్రకారం క్లాసిఫికేషన్ చేంజ్ చేశారో అర్ధం కావడం లేదని ఓ రెవెన్యూ ఉద్యోగి అనుమానం వ్యక్తం చేశారు. తామూ ‘దిశ’ పత్రికలో వచ్చిన తర్వాతే డీడీఎంస్ అంటే ధరణి డేటా మోడిఫికేషన్ సిస్టం అని తెలుసుకున్నామన్నారు.

38 ఈ పట్టాలు ఉన్నాయన్న కారణాన్ని చూపించినట్లు తెలిసింది. కానీ వాటికి సంబంధించిన పత్రాలేవీ తాము చూడలేదన్నారు. వాటిని పరిశీలించి నివేదిక ఇచ్చిన దాఖలాలు కూడా లేవన్నారు. ఐతే ఏ డేటా కరెక్షన్‌కు ముందు అయిన రిపోర్ట్, పరిశీలన, ఆమోదం వంటివి తప్పనిసరి. మరి ఈ ఖరీదైన రూ.వంద కోట్ల భూమి క్లియరెన్స్‌లో ఎలాంటి నిబంధనలను పాటించారో అర్ధం కావడం లేదన్నారు. అంతా జిల్లా కలెక్టరేట్‌లోనే మార్పు చోటు చేసుకుందని రెవెన్యూ ఉద్యోగుల్లో చర్చ నడుస్తున్నది.

వీటికేది క్లియరెన్స్?

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో సర్వే నం.44లో 13.26 ఎకరాలు, 45లో 19.18 ఎకరాలు, 108లో 2.36 ఎకరాలు, 245లో 1.23 ఎకరాలు, 246లో 1.33 ఎకరాలు, 248లో 1.19 ఎకరాలు, 249లో 1.06 ఎకరాలు, 250లో 0.30 ఎకరాలు, అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజాల్‌లో సర్వే నం.6లో 13.03 ఎకరాలు, 249లో 3.22 ఎకరాలు, 252లో 3.30 ఎకరాలు, 254లో 9.20 ఎకరాలు, 265లో 4.06 ఎకరాలు, 276లో 10.15 ఎకరాలు, 500లో 10.25 ఎకరాలు, 501లో 12.16 ఎకరాలు, 504లో 11.28 ఎకరాలు, 505లో 9.28 ఎకరాలు, 506లో 8.08 ఎకరాలు, 508లో 11.15 ఎకరాలు, 509 నుంచి 662 వరకు సుమారు 200 ఎకరాల సీలింగ్ సర్ ప్లస్‌గా నమోదు చేశారు.

వాటిలో చాలా వరకు హార్డ్ వేర్ పార్కుకు ఇచ్చేశారు. ఇంకొంత మూడు దశాబ్దాల క్రితమే ప్లాట్లు చేసి అమ్మేశారు. ఇప్పుడేమో ఆ ప్లాట్ల యజమానులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్ అని, ఎవాక్యూ ప్రాపర్టీ అంటూ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్టులో నమోదు చేశారు. రిజిస్ట్రేషన్లు ఏం ఆగలేదు. కాకపోతే పీవోబీలోని ప్లాట్లకు కాస్త అమ్యామ్యాలు ఎక్కువ తీసుకొని ఇస్తున్నారని అందరికీ తెలుసు. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలోని స్థలాల రిజిస్ట్రేషన్లు కాస్లీగా మారాయి. ప్రభుత్వం సీలింగ్ సర్ ప్లస్ అని డిక్లేర్ చేసినప్పుడు 30 ఏండ్ల క్రితమే రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలి.

కానీ అప్పటి నుంచి అనేక మంది చేతులు మారుతూనే ఉన్నది. ఇప్పుడేమో ఇండ్లు కట్టుకునేందుకు వెళ్తే మీ ప్లాట్లకు అనుమతులు ఇవ్వమంటూ తుర్కయంజాల్ మున్సిపాలిటీ రిజెక్ట్ చేస్తున్నది. ఈ తప్పెవరిది? దీనికి బాధ్యులెవరు? పదేండ్లుగా ఆ ప్లాట్ల యజమానులు అందరికీ మొర పెట్టుకుంటూనే ఉన్నారు. మరి వీరి స్థలాలను సీలింగ్ సర్ ప్లస్ కాదు.. పట్టా అని ఎందుకు పరిగణించడం లేదు? ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా సామాన్యులు కావడం వల్లేనా? ఇక్కడ కూడా అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తే రెవెన్యూ రికార్డులు మార్చేస్తారా? అని విమర్శిస్తున్నారు.

కనిపించని విజ్ఞప్తులు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజాల్​రెవెన్యూ పరిధిలో 30 సర్వే నంబర్లలోని మొత్తం 279.48 ఎకరాలను సీలింగ్​సర్ ప్లస్‌గా ల్యాండ్‌గా అధికారులు పేచీ పెట్టారు. దీనిపై అనేక పోరాటాల తర్వాత రంగారెడ్డి ఈస్ట్​డివిజన్ ల్యాండ్​రీఫార్మ్స్ 2004లో నాన్ సీలింగ్‌గా డిక్లేర్ చేసింది. కానీ ధరణి పోర్టల్‌లో నాన్​సీలింగ్‌గా ప్రకటించిన 17 సర్వే నంబర్లను పీఓబీ నుంచి తొలగించారు. కానీ సర్వే నంబర్లు 504, 523, 529, 536, 537, 539, 540, 547, 548, 657, 658, 660, 661 లను మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. ఈ భూమి కూడా క్లియర్ అని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి.

కానీ అధికారులు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. దాంతో ఈ సర్వే నంబర్లలో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. ఎంతో మంది ప్లాట్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఏనాడో వెంచర్లు అయ్యాయి. అనేక సేల్​డీడ్స్ ఉన్నాయి. కానీ కొన్ని సర్వే నంబర్లలోని భూమిపై అధికారులు వివక్ష చూపిస్తున్నారు. ప్లాట్ల యజమానులు, భూముల పట్టాదారులు ఎన్నోసార్లు తహశీల్దార్, కలెక్టర్‌ను కలిసి వేడుకున్నారు. ఐనా ధరణి పోర్టల్​నుంచి విముక్తి కల్పించేందుకు ససేమిరా అంటున్నారు. దాంతో కలెక్టర్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఇలాంటి విజ్ఞప్తులు మాత్రం గతంలో పని చేసిన అధికారులకు కనిపించలేదు.

Next Story

Most Viewed