బ్రేకింగ్: సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ప్రొఫెసర్ హరగోపాల్‌పై ‘ఉపా’ (యాంటీ టెర్రర్ యాక్ట్ ) చట్టం ప్రకారం నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ డీజీపీ అంజనీ కుమార్‌ను ఆదేశించారు. ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా ఉన్న మావోయిస్టులు మినహా మిగతా వారిపై కూడా కేసులు ఎత్తివేయనున్నట్టు సమాచారం.

ఏడాది క్రితమే హరగోపాల్‌తో పాటు మొత్తం 152 మందిపై నమోదైన ఈ కేసులు ఊహించని రీతిలో ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే. పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్ మెంట్ అధ్యక్షుడు చంద్రమౌళిని రెండు నెలల క్రితం పోలీసులు అరెస్ట్ చెయ్యగా ఆయన రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనపై మరిన్ని కేసులు ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు చెప్పారు.

ఆ కేసుల వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించగా ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్లో గత ఏడాది నమోదైన ఎఫ్ఐఆర్ వెలుగు చూసింది. అందులో చంద్రమౌళి, హరగోపాల్‌తో పాటు కొందరు మావోయిస్టులు, వేర్వేరు ప్రజా సంఘాల నాయకుల పేర్లు ఉన్నాయి. గత సంవత్సరం తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి గ్రామంలో మావోయిస్టు పార్టీ నాయకులు సమావేశమై ఉన్నట్టు తెలిసి కూంబింగ్ జరిపినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇది తెలిసి మావోయిస్టులు తప్పించుకొని వెళ్లిపోయినట్టు తెలిపారు.

అక్కడ దొరికిన పత్రాల్లో పలువురు ప్రజా సంఘాల నాయకులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు లభించినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ నాయకులు పుల్లూరి ప్రసాదరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజా షా, విమలక్క, కొయ్యడ సాంబయ్యతో పాటు మొత్తం 152 మందిపై ఐపీసీ 120బీ, 147, 148, రెడ్ విత్ 149 సెక్షన్లతో పాటు ఉపా యాక్ట్ సెక్షన్ 10, 13, 18, 20, 38 ప్రకారం కేసులు నమోదు చేసినట్టు కోర్టుకు తెలిపారు.

విమర్శల వెల్లువ..

ప్రొఫెసర్ హరగోపాల్, ఇతర ప్రజా సంఘాల నాయకులపై ఉపా యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చెయ్యటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కేయ్యటానికే ప్రభుత్వం, పోలీసులు ఈ కేసులు పెట్టారని ప్రతిపక్ష పార్టీల నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే హరగోపాల్‌పై పెట్టిన కేసులను ఎత్తి వెయ్యాలని సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి మరికొన్ని గంటల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Next Story

Most Viewed