మరికొద్ది గంటల్లోనే.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

by  |
మరికొద్ది గంటల్లోనే.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మరికొద్ది గంటల్లో భూముల మార్కెట్​ విలువలను, రిజిస్ట్రేషన్​ ఫీజులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇంటి స్థలాలకు 30 నుంచి 50 శాతం, వ్యవసాయ భూములకు 30 నుంచి 150 శాతం వరకు మార్కెట్​ విలువలను పెంచనుందని విశ్వసనీయంగా తెలిసింది. ఐతే రిజిస్ట్రేషన్ ​ఫీజును మాత్రం 6 నుంచి 7.50 శాతానికి పెంచుతున్నట్లు సమాచారం. ఒకేసారి 1.50 శాతాన్ని పెంచడంతో ఆదాయం 25 శాతం పెరుగుతుందని అంచనా. ఫీజుల క్లాసిఫికేషన్ లోనూ మార్పులు తీసుకురానుంది. గతంలో స్టాంపు డ్యూటీతో పాటు ట్రాన్స్ఫర్ ​ఆఫ్ డ్యూటీ కింద 1.5 శాతాన్ని వసూలు చేసేది. ఇప్పుడు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ​ఫీజు మాత్రమే ఉంటుందని తెలిసింది.

ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ ​ఆఫ్ ​డ్యూటీ కింద వచ్చిన నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేసేవారు. అభివృద్ది కార్యక్రమాల కోసం తోడ్పాటు అందించేవారు. ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు సమకూరేవి. ఐతే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ఫీజుల సవరణలో స్థానిక సంస్థలకు కేటాయించే నిధులను ఏ ప్రాతిపదికన మంజూరు చేస్తుందో వేచి చూడాలి. ఇప్పటి దాకా భూ క్రయ విక్రయాలు అత్యధికంగా జరిగే స్థానిక సంస్థలకు స్టాంప్స్ అండ్​రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ప్రతి ఏటా రూ.కోట్లల్లో ఆదాయం వచ్చేది. వాటితో కొత్తగా విస్తరించిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెసులుబాటు కలిగేది. ఇప్పటివరకు గిఫ్ట్ ​డీడ్​వల్ల ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం సమకూరేది కాదు. ఇప్పుడు ఆ మాడ్యూల్​ను కూడా మార్చనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందులో కుటుంబ సభ్యులకు సంబంధించిన మార్పులు చేయనున్నట్లు సమాచారం. పార్టిషన్ డీడ్​కి సంబంధించిన అంశాల్లోనూ మ్యుటేషన్ల చార్జీలు తప్ప మరో రకమైన ఆదాయం రావడం లేదు. అంటే రిజిస్ట్రేషన్ చార్జీలు ఖజానాకు చేరవు. ప్రతి అంశంలోనూ, ఆస్తి లావాదేవీ మార్పుల్లోనూ ప్రభుత్వానికి ఆదాయం సమకూరేటట్లుగా కొత్త విధానాలను అమలు చేయనున్నట్లు తెలిసింది.

Next Story

Most Viewed