బోసిపోయిన నగరం

by  |
బోసిపోయిన నగరం
X

దిశ, న్యూస్‌బ్యూరో:

కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలు పకడ్బందీగా అమలవుతున్నాయి. జనసమ్మర్థం లేకుండా వివిధ సంస్థలు చర్యలు తీసుకున్నాయి. సినిమాహాళ్ళన్నీ మూతబడ్డాయి. పబ్లిక్ పార్కులు, క్లబ్బులు, పబ్బులు, ఎమ్యూజ్‌మెంట్ పార్కులు మూతపడ్డాయి. ఆదివారం సెలవుదినం కావడంతో రోడ్లపై వాహనాల రద్దీ సహజంగానే తక్కువగా ఉంటుంది. సినిమాహాళ్ళు, పబ్లిక్ ప్లేసుల దగ్గర మాత్రం రద్దీ ఉంటుంది. కానీ, ప్రభుత్వం కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో ప్రజలు రోడ్లమీదకు రావడం తగ్గిపోయింది. సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే రవీంద్రభారతి లాంటి సంస్థలు కూడా మూతబడ్డాయి. నగరంలో చాలా రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రజలు గుమికూడే ప్రాంతాలు మూతబడడంతో నిశ్శబ్ద వాతావరణం కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు అన్ని సంస్థలూ సకాలంలో సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకున్నాయి. కొన్ని ప్రముఖ షాపింగ్ మాల్స్ దగ్గర నిత్యావసర వస్తువులు కొనుక్కునే ప్రజలతో కిటకిటలాడాయి.

విశ్వవిద్యాలయాలు సైతం సెమినార్లు, వర్క్‌షాపులను అర్ధాంతరంగా రద్దుచేశాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సైతం అన్ని విద్యాసంస్థలకు సర్క్యులర్ జారీచేసింది. ప్రతి వాష్‌రూమ్‌లో హ్యాండ్‌వాష్ లేదా సబ్బును ఉంచాలని, నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చేతులుపడే ప్రతి చోటా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని స్పష్టం చేసింది. తరగతి, హాస్టల్ గదుల్లో ప్రతిరోజు క్రిమిసంహారక మందుల స్ప్రే చల్లాలని ఆదేశించింది. ఇందిరాపార్కు, పబ్లిక్ గార్డెన్స్, ఎన్టీఆర్ పార్కు, ఎన్టీఆర్ మెమోరియల్ లాంటి పబ్లిక్ స్థలాలన్నింటినీ మూసివేస్తున్నట్లు సంబంధిత శాఖలు ఉత్తర్వులు జారీచేశాయి. దీంతో సెలవు రోజున ఇంటిల్లిపాదీ బైటకు రాకుండా ఇళ్ళకే పరిమితమయ్యారు. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యల అవగాహనతో ప్రజలు తీసుకుంటున్న స్వీయ నియంత్రణ చర్యలు తొలి రోజున సత్ఫలితాలనే ఇచ్చాయి.

కరోనా అప్రమత్తతతో శిల్పారామం, శిల్పకళావేదిక తదితర వేదికల్లో జరిగే ఉగాది పండుగ సాంస్కృతిక కార్యక్రమాలు సైతం రద్దయ్యాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండుకు చేరడంతో ప్రభుత్వం మరింత ప్రబలకుండా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఉన్నతస్థాయి కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు అమలుకావడంపై పర్యవేక్షిస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ శంషాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించి అక్కడి వైద్య సిబ్బందితో పరిస్థితిని సమీక్షించారు. విదేశీ ప్రయాణకులకు వైద్యపరీక్షలు నిర్వహించే సమయంలో తీసుకుంటున్న స్వీయ జాగ్రత్తలపై తగిన సూచనలు చేశారు.

తొలిరోజు నగరంలోని పరిస్థితి నియంత్రణలోనే ఉందని ప్రభుత్వాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర్వులు అమలుకావడం, ప్రజలు కూడా సహకరించడం నివారణాచర్యలకు దోహపడుతుందన్న అభిప్రాయాన్ని పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నెల చివరి వరకూ ఇలాంటి నియంత్రణ అవసరమని, ప్రభుత్వం నిర్దేశించిన ఆంక్షలకు ప్రజల సహకారం సంపూర్ణంగా లభిస్తే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వినోద కార్యకలాపాల కేంద్రాలన్నీ మూతపడడంతో షాపింగ్ మాల్స్‌లలో రద్దీ పెరిగింది. ఈ నెల చివరి వరకూ ప్రభుత్వ ఆంక్షలు ఉన్నందున రానున్న పదిహేను రోజుల్లో నగరంలో ఇప్పటివరకూ చూడని విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది. తేలికపాటి కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపిస్తుందేమో అనే ఒక సాధారణ అభిప్రాయం ప్రజల్లో నెలకొనింది.

Tags : Telangana, Corona, Preventive Measures, Cinema Halls, Ravindra Bharati, Closure

Next Story