అనాథలకు ప్రభుత్వమే తల్లీ, తండ్రీ: సత్యవతి రాథోడ్

by  |
అనాథలకు ప్రభుత్వమే తల్లీ, తండ్రీ: సత్యవతి రాథోడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అనాథ పిల్లలకు తల్లీ తండ్రీ ప్రభుత్వమేనని, వారికి పెళ్ళి అయ్యి కుటుంబంగా స్థిరపడేంతవరకు ప్రభుత్వమే అన్ని బాధ్యతలూ చూసుకుంటుందని, ఆ తరహాలో సమగ్రమైన సంపూర్ణ విధానాన్ని, చట్టాన్ని రూపొందించనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్రంలోని అనాథ పిల్లల సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అవలంబించాలో ఖరారు చేయానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన ఏర్పడిన మంత్రివర్గ ఉప సంఘం తొలిసారి సమావేశమై ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కరోనా కారణంగా అనాథలైన పిల్లలు జీవితంలో స్థిరపడేంత వరకు అన్ని రకాల బాధ్యతలను ప్రభుత్వమే చూసుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కోవిడ్ వల్ల అనాథలుగా మారినవారి స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు దేశంలోనే అత్యుత్తమమైన, ఆదర్శవంతమైన, సమగ్రమైన సంపూర్ణ విధానాన్ని రూపొందించి ప్రభుత్వానికి అందించాలని కమిటీ అభిప్రాయపడింది. సబ్ కమిటీ మొదటి సమావేశానికి మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, జగదీష్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాసగౌడ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. అనాథల సంక్షేమాన్ని ప్రభుత్వం మానవీయ కోణంలో చూస్తుందని, ఎంత ఖర్చయినా భరిస్తుందని, ఈ పాలసీ దేశం మొత్తం గర్వించే విధంగా, ఇతర రాష్రాలన్నీ అనుసరించే విధంగా ఉండేలా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిటీలోని సభ్యులంతా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు.

అనేక అంశాల్లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు, మొత్తం దేశానికే ఆదర్శవంతంగా ఉన్నదని, అనాథల సంక్షేమంలోనూ అదే తరహాలో ఉంటుందన్నారు. న్యాయపరమైన చిక్కులేవీ లేకుండా పకడ్బందీగా అనాథల పాలసీని రూపొందించేలా ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిపారు. పాత చట్టాలకు మార్పులు చేయడమో లేక సవరణలు చేయడమో కాకుండా సంపూర్ణంగా, సమగ్రంగా కొత్త విధానాన్ని రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు విహార్‌లు, హోమ్‌లు, ఆశ్రమాలను పటిష్టంగా తయారుచేస్తూ, ప్రైవేట్ ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో నడుస్తున్న అనాథ ఆశ్రమాలను ప్రోత్సహించడానికి కూడా తగిన సూచనలు చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో సభ్యులు పరిశీలించి అభిప్రాయాలు క్రోడీకరించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.

Next Story