దానికోసం భార్యను అమ్మేసిన రానా.. తాకట్టు పెట్టానంటూ క్లారిటీ

by  |
దానికోసం భార్యను అమ్మేసిన రానా.. తాకట్టు పెట్టానంటూ క్లారిటీ
X

దిశ, వెబ్‌‌డెస్క్: డబ్బుల కోసం ప్రబుద్ధుడు ఎంతటికైనా దిగజారుతాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. కష్టం చేతగాక కట్టుకున్న భార్యను పోషించలేక అతడికొచ్చిన చెడ్డ ఆలోచన కటకటాలపాలు చేసింది. పెండ్లయిన నెలకే అపురూపంగా చూసుకోవాల్సిన భర్త డబ్బుల కోసం భార్యను అమ్మేశాడు. ఆ డబ్బులతో స్మార్ట్‌ఫోన్ కొన్నాడు. అది కవర్ చేసుకునేందుకు మరొకరితో ఎఫైర్ పెట్టుకుని లేచిపోయిందని విష ప్రచారం చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని బలంగీర్ జిల్లా బెల్‌పడా పోలీస్ స్టేషన్‌లో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..

బెల్‌పడా పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేకల ప్రాంతానికి చెందిన రాజేష్ రానాకు ఆగస్టులో ఓ యువతి(17)తో పెండ్లి జరిగింది. పెండ్లి తంతు అనంతరం బతుకుదెరువు కోసం ఆ దంపతులు ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌‌లో ఇసుకబట్టిలో పనిచేసేందుకు వలస కూలీలుగా వెళ్లారు. ఇదే పని నిమిత్తం అక్కడి నుంచి రాజస్థాన్ బరన్ జిల్లాకు వెళ్లారు. ఇసుక బట్టిలో పని చేతగాలేదో.. ఇంకే ఇతర కారణమో తెలియదు గానీ.. కట్టుకున్న భార్యను సంతలో పెట్టి అమ్మేశాడు రాజేష్ రానా. అది కూడా ఓ 55 ఏళ్ల వృద్ధుడికి రూ. 1.8 లక్షలకు విక్రయించడం గమనార్హం.

మరొకరితో వెళ్లిపోయిందని నాటకాలు..

భార్యను ముసలోడికి వదిలించుకున్న రాజేష్ రానా ఆ డబ్బులతో జల్సాలు చేశాడు. ఓ స్మార్ట్‌ఫోన్ అయితే కొన్నాడు. చేతిలో డబ్బులు ఖాళీ అయ్యాయే లేక ఇతర కారణమో తెలియదు గానీ, తిరిగి ఒడిశాలోని స్వగ్రామానికి వచ్చాడు. కూతురు-అల్లుడు ఇంటికొచ్చారని తెలుసుకున్న తల్లిదండ్రులకు రాజేష్ తప్పుడు సమాచారం చెప్పాడు. పని కోసం వెళితే అక్కడ మరొకరితో మీ కూతురు ఎఫైర్ పెట్టుకుని, వెళ్లిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. నాటకాలు ఆడాడు. అల్లుడి కుంటి సాకులను నమ్మని బాధిత తల్లిదండ్రులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల ఎంట్రీతో అసలు విషయం వెలుగులోకి..

బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో షాకింగ్ విషయాలు రాబట్టారు. నిందితుడిని తమదైన శైలిలో విచారించగా.. రాజస్థాన్‌లోని బరన్ జిల్లా బారన్ గ్రామానికి చెందిని ఓ వృద్ధుడి వద్ద తాకట్టు పెట్టినట్టు చెప్పాడు. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు మరో ట్విస్ట్ ఎదురైంది. రాజేష్ రానా తన భార్యను తాకట్టు పెట్టలేదని, రూ. 1.8 లక్షలకు అమ్మినట్టు కుండ బద్ధలు కొట్టాడు సదరు వ్యక్తి.

అంతేకాదు, తాను కొనుగోలు చేసిన యువతి(17)ని తీసుకెళ్లనివ్వమని వాదించగా.. బాధితురాలిని అక్కడి నుంచి విడిపించే ప్రయత్నంలో పోలీసులకు గ్రామస్తులు కూడా అడ్డుతగలడం గమనార్హం. ఇదే సమయంలో బతుకుదెరువు కోసం తీసుకొచ్చి తనను అమ్మేశాడంటూ బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. తనను విడిచిపెట్టాలంటూ ప్రాధేయపడింది. ఈ క్రమంలోనే లోకల్ పోలీసుల సహకారం తీసుకున్న బలంగీర్ పోలీసులు బాధితురాలిని అతి కష్టం మీదవిడిపించారు. దీనికి కారణమైన భర్త రాజేష్ రానాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.


Next Story