మైక్రోసాఫ్ట్ మరోసారి షాకింగ్ నిర్ణయం.. వచ్చేవారం భారీగా లేఆఫ్‌లు!

by Yella Dhawani Reddy |

ఇటీవల కాలంలో సాఫ్ట్‌వేర్ రంగాన్ని లేఆఫ్‌ గుబులు వెంటాడుతోంది.

మైక్రోసాఫ్ట్ మరోసారి షాకింగ్ నిర్ణయం.. వచ్చేవారం భారీగా లేఆఫ్‌లు!
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో సాఫ్ట్‌వేర్ (Software) రంగాన్ని లేఆఫ్‌ గుబులు వెంటాడుతోంది. ఓ వైపు కృత్రిమ మేధ, ఆటోమేషన్‌ దిశగా టెక్ పరిశ్రమలు పరుగులు పెడుతుండగా, మరోవైపు అనేక దిగ్గజ ఐటీ సంస్థలు ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నాయి. గూగుల్‌, మెటా, అమెజాన్‌, సేల్స్‌ఫోర్స్‌ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించగా, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ (Microsoft) భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఈ సంస్థ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. వచ్చేవారం మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ (Bloomberg) పత్రిక కథనంలో పేర్కొంది.

అయితే, ఈసారి ఎక్స్‌బాక్స్‌ విభాగంలోని ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ సంస్థ లక్ష్యంగా చేసుకొన్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. ఇప్పటికే 69 బిలియన్ డాలర్లకు యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్.. లాభదాయకతపై దృష్టిసారించాలని వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరం (జూన్ 30) ముగిసేలోపు సంస్థ పున:వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తొలగించనుంది. ఇక ఇది గత 18 నెలల్లో సంస్థ ప్రకటించిన నాలుగో అతిపెద్ద లేఆఫ్‌ కానుందని పేర్కొంది. మే నెలలో కూడా కంపెనీ 6,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా, అందులో ఎక్కువ శాతం ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ టీమ్‌లు ఉన్నారు.

ఇక ఎక్స్‌బాక్స్‌ డివిజన్‌ మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ కన్సోల్స్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌ స్టూడియోలు, గేమ్‌పాస్‌ వంటి డిజిటల్‌ సర్వీసులను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ విభాగంలో పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. చాలా సబ్సిడిరీలను మూసివేసింది. గేమింగ్‌ డివిజన్‌పై దృష్టిని తగ్గిస్తూ, మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం కృత్రిమ మేధ (AI), క్లౌడ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలపై దృష్టిసారిస్తోంది. చిన్న, మధ్యస్థాయి సంస్థలకు ఇచ్చే సాఫ్ట్‌వేర్‌ సేల్స్‌ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చి.. ఇన్‌హౌస్‌ ఉద్యోగుల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక జూన్‌ 2024 నాటికి మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 45 వేల మంది మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగాల్లో పనిచేస్తున్నారు. త్వరలో వచ్చే లేఆఫ్‌ వల్ల ఈ విభాగాలపై కూడా ప్రభావం పడే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

Next Story