'సూపర్ యాప్' కోసం టాటా టెలీసర్వీసెస్‌ పునరుద్ధరణ

by  |
సూపర్ యాప్ కోసం టాటా టెలీసర్వీసెస్‌ పునరుద్ధరణ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ టాటా సన్స్ తన రిటైల్ వ్యాపారాలన్నిటినీ ఒకే గూటికి చేర్చి ‘సూపర్ యాప్’ పేరుతో డిజిటల్ వేదికను ప్రారంభించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో అనుబంధ సంస్థలుగా ఉన్న టాటా రిటైల్ వ్యాపారాలు టాటా క్లిక్, టాటా స్కై, స్టార్‌క్విక్, క్రోమా అన్ని టాటాసన్స్‌లో విలీనం అవనున్నాయి. అయితే, కరోనా సంక్షోభం తర్వాత పెరిగిన డిజిటల్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని టాటా సంస్థ తన టెలికాం విభాగం టాటా టెలీసర్వీసెస్‌ను పునరుద్ధరించేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ లేదంటే వచ్చే ఏడాది జనవరి నాటికి టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలో సాంకేతిక మద్ధతును టాటా టెలీసర్వీసెస్ ఇవ్వగలదని కంపెనీ అభిప్రాయపడుతోంది. అలాగే, సూపర్ యాప్ కోసం సుమారు రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా సంస్థ సిద్ధంగా ఉంది. సూపర్ యాప్ ద్వారా టాటా సంస్థకు చెందిన అన్ని ఉత్పత్తులను, సేవలను సూపర్ యాప్‌కి తీసుకురావాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే టెలీసర్వీసెస్ వంటి సాంకేతిక భరోసా తప్పనిసరి అని కంపెనీ వర్గాలు సైతం వెల్లడించాయి. సూపర్ యాప్ కోసం ఈ విభాగాన్ని పునరుద్ధరించడం ద్వారా సొంత సంస్థకే కాకుండా టెలికాం రంగంలో టాటా టెలీసర్వీసె మైలేజ్‌కు కూడా ఉపయోగపడుతుంది. గత 6 ఏళ్లుగా సుమారు రూ. 46,595 కోట్ల విలువైన నగదును చొప్పించినప్పటికీ టాటా టెలీసర్వీసెస్ సంస్థ ఆశించిన ఆదాయాలను నమోదు చేయలేదు. ఈ క్రమంలో దీన్ని మళ్లీ సిద్ధం చేయడం ద్వారా పుంజుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

టెలికాం రంగంలోనూ పోటీకి సిద్ధం…

భారతీ ఎయిర్‌టెల్‌తో డీమెర్జర్ అయిన తర్వాత టాటా టెలిసర్వీసెస్ ఎంటర్‌ప్రైజెస్ విభాగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 37 కోట్ల లాభాలను వెల్లడించింది. ఆదాయం కేవలం రూ. 1,858 కోట్లుగా ఉన్నాయి. మొత్తంగా కంపెనీ రూ. 13,325 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో సూపర్ యాప్‌కు సాంకేతిక మద్దతును టాటా టెలీసర్వీసెస్‌ను ఇవ్వగలదని, అంతేకాకుండా టాటా టెలీసర్వీసెస్‌ తన భవిష్యత్తుకు సంబంధించి పునరుద్ధరణ అవకాశాలు లభిస్తాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా 19 టెలికాం సర్కిళ్లలో విస్తరించి ఉంది. జీఎస్ఎం, సీడీఎంఏ, 3జీ ప్లాట్‌ఫామ్‌లలో వైర్‌లైన్స్, వైర్‌లెస్ నెట్‌వర్క్ వినియోగదారుల టెలికాం పరిష్కారాలను అందిస్తోంది. ఈ విభాగాన్ని పునరుద్ధరించడం ద్వారా టాటా గ్రూప్ భారత డిజిటల్ రంగంలో మరింత వేగంగా విస్తరించగలదు. అంతేకాకుండా, ఇటీవల దూకుడుగా ఉన్న రిలయన్స్ జియో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలకు సూపర్‌యాప్ ద్వారా పోటీ ఇవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.

ప్రస్తుతం అతిపెద్ద ఫ్రాంచైజీ…

సూపర్ యాప్ ద్వారా కంపెనీకి చెందిన వివిధ వినియోగదారు సేవలను ఏకతాటిపైకి తీసుకురావాలని టాటా గ్రూప్ ప్రయత్నిస్తోంది. టాటా గ్రూప్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో తనిష్క్ ఆభరణాల స్టోర్లు, టైటాన్ గడియారాలు, స్టార్ బజార్ సూపర్ మార్కెట్లు, స్టార్‌బక్స్, తాజ్ హోటల్స్, వెస్ట్‌సైడ్, టాటా క్లిక్, టాటా స్కై, క్రోమా, స్టార్‌క్విక్‌లన్నీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో కొనసాగుతున్నాయి. జియో, అమెజాన్‌లతో పోలిస్తే సొంత బ్రాండ్‌లతో టాటా గ్రూప్ సంస్థ అతిపెద్ద ఫ్రాంచైజీని కలిగి ఉంది. వీటన్నిటినీ కలిపి సూపర్ యాప్ ద్వారా అనేక రకాలైన ఉత్పత్తులను, సేవలకు పరిష్కారం అందిస్తుందని, దీనివల్ల ఎప్పటికప్పుడు వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించే వీలవుతుందని కంపెనీ భావిస్తోంది.

టాటా గ్రూప్ ప్రస్తుతం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో వాటాలను విక్రయించేందుకు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది. సూపర్ యాప్‌లో గణనీయమైన స్థాయిలో వాటా కోసం అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇప్పటికే చర్చలు ప్రారంభించిందని, దీనికోసం వాల్‌మార్ట్ సంస్థ సుమారు రూ. 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశముందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ఇరు కంపెనీల మధ్య చర్చలు విజయవంతమైతే టాటా, వాల్‌మార్ట్ జాయింట్ వెంచర్‌గా సూపర్ యాప్ ప్రారంభమవనుంది.

Next Story