టార్గెట్ మంథని, హుజురాబాద్.. ప్రక్షాళన షురూ!

by  |
Transfer officers
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ రెండు నియోజకవర్గాలే టార్గెట్ గా బదిలీల ప్రక్రియ మొదలైంది. మంత్రి వర్గం నుండి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్ లోని అన్ని శాఖాల అధికారులను బదిలీ చేస్తే, మంథనిలో పోలీసుల బదిలీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తాజాగా హుజురాబాద్ లోని ఎమ్మార్వోలు, ఎంపీడీఓల బదిలీల్లో వెలువడిన ఉత్తర్వుల్లో అధికారులు విచిత్రంగా ఆదేశాలు జారీ చేశారు. గతంలో పోస్టింగ్ ఉన్న ప్రాంతం నుండి ఎక్కడికి బదిలీ చేశారు అన్న వివరాలతో ఆదేశాలు ఇచ్చేవారు. కానీ శనివారం రాత్రి వెలువడ్డ బదిలీ ఉత్తర్వుల్లో ఓ జిల్లా నుండి మరో జిల్లాకు బదిలీ చేసినట్టు ఆదేశాలు వెలువడడం గమనార్హం.

హుజురాబాద్ నియోజకవర్గంలోని అధికారుల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్డీఓను బదిలీ చేసిన వెంటనే ఇతర శాఖల మండల స్థాయి అధికారులపై బదిలీ వేటు పడింది. వివిధ మండలాల్లో పనిచేస్తున్న తహసీల్దార్ బావ్ సింగ్ జ్యోతి వరలక్ష్మీ దేవిలను సిరిసిల్ల జిల్లాకు, నారాయణను పెద్దపల్లి జిల్లాకు, కనకయ్యను పెద్దపల్లి ఎస్సీ కార్పోరేషన్ కు బదిలీ చేశారు. అయితే వీరికి వ్యక్తిగతంగా ఆర్డర్లను జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎంపీడీఓల బదిలీ ఉత్తర్వుల్లో మాత్రం వారిని ఎక్కడెక్కడకు బదిలీ చేశారో స్పష్టంగా ఇచ్చారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఎంపీడీఓ రమేష్ ను హుజురాబాద్ కు, మెట్ పల్లి ఎంపీడీఓ కల్పనను జమ్మికుంటకు, కోరుట్లలో పనిచేస్తున్న శ్రీనివాస్ ను వీణవంకకు, వరంగల్ రూరల్ జిల్లా పల్లవిని కమలాపూర్ కు బదిలీ చేశారు. అయితే ఆయా మండలాల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఎంపీడీఓల స్థానంలో వారిని నియమించామని బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ వారిని ఎక్కడికి బదిలీ చేశారో మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం విచిత్రం.

ఇకపోతే హుజురాబాద్ పోలీసు అధికారులపై కూడ బదిలీ వేటు పడక తప్పలేదు. ఏసీపీ సుందరగిరి శ్రీనివాస రావు డీజీపీ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయనున్నారు. జమ్మికుంట రూరల్ సీఐగా కరీంనగర్ సీసీఎస్ లో పని చేస్తున్న జె.సురేష్‌ను, స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న వి.శ్రీనివాస్ ను హుజురాబాద్‌కు, ధర్మపురి సీఐ రాంచందర్ రావును జమ్మికుంట టౌన్ కు బదిలీ చేశారు. ఆయా చోట్ల పనిచేస్తున్న సదన్ కుమార్, సీహెచ్ విద్యాసాగర్, రమేష్ లను కరీంనగర్ రేంజ్ డీఐజీకి అటాచ్డ్ చేశారు.

మంథనిలో ఇలా…

పెద్దపల్లి జిల్లా మంథనిలోనూ పోలీస్ అధికారుల బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. వామన్ రావు మర్డర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జడ్పీ చైర్మన్ పుట్ట మధుకి సన్నిహితంగా ఉన్న పోలీస్ అధికారుల జాబితను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మంథని సీఐ మహేందర్ రెడ్డిని వరంగల్ కమిషనరేట్‌కు, ముత్తరాం, మంథని, రామగిరి ఎస్ఐలు నరసింహరావు, ఓంకార్, మహేందర్ లను బదిలీ చేశారు. మంథని ఎస్ఐ ఓంకార్ ములుగుకు, రామగిరి ఎస్ఐ మహేందర్ బసంత్ నగర్ కు, ముత్తరాం ఎస్ఐ నరసింహ రావును రామగుండం టాస్క్ ఫోర్స్ కు బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ ఆ రెండు నియోజకవర్గాలే అన్నట్టుగా బదిలీల ప్రక్రియ సాగుతుండడం గమానార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చకు వేదికగా మారిన హుజురాబాద్, మంథని నియోజకవర్గల్లోనే బదిలీల తంతు సాగుతుండడం ప్రత్యేకత సంతరించుకున్నట్టుగా మారింది.

Next Story

Most Viewed