అప్రమత్తంగా పనిచేయండి… విజయం మనదే : కిషన్​ రెడ్డి

by Disha Web Desk 11 |
అప్రమత్తంగా పనిచేయండి… విజయం మనదే : కిషన్​ రెడ్డి
X

దిశ, ముషీరాబాద్/అంబర్ పేట: తెలంగాణలో మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతున్నదని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జి.కిషన్​ రెడ్డి అన్నారు. కార్యకర్తలు, బూత్​ కమిటీ ప్రతినిధులు చివరిదశలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బీజేపీ నగర కార్యాలయంలో గురువారం నిర్వహించిన ముషీరాబాద్, అంబర్​ పేట​, సికింద్రాబాద్ పార్టీ నాయకులు, బూత్​ కమిటీ ప్రతినిధులతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ చేపట్టిన రెండో దశ క్యాంపెయినింగ్​, ఇంటింటి ప్రచారంపై సమీక్ష నిర్వహించారు.

ఇప్పటికే ప్రచారం 75 శాతానికి పైగా పూర్తయిందని, ప్రజల్లో బీజేపీ పట్ల సానుకూల స్పందన ఉందని ఈ సందర్భంగా బూత్​ కమిటీ సభ్యులు వివరించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్నందున బూత్​ కమిటీ ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇతర పార్టీల ప్రతినిధులు ఎక్కడైనా ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువచ్చి ఈసీకి ఫిర్యాదు చేయాలన్నారు. పౌరులందరూ స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కృషి చేయాలని చెప్పారు. సికింద్రాబాద్​ పార్లమెంట్​ స్థానంలో మరోసారి కమలం పార్టీ జెండా ఎగురబోతున్నదని, ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదన్నారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ బూత్ పరిధిలోనే కార్యకర్తలు 12 గంటలపాటు పనిచేయాలని మీతో పాటు నేను పని చేస్తానని తెలిపారు. ఈ నెల 10న ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు 10 నుంచి 30 కుటుంబాలను ప్రతి బూత్ లో కార్యకర్తలు కలిసి వారికి మోదీ ప్రభుత్వ విజయాలు వివరించాలన్నారు. 13న పోలింగ్ జరిగే రోజు ప్రతి కార్యకర్త తన నివాసం సమీపంలోని 10 కుటుంబాలతో ఓటు వేయించే దిశగా ప్రయత్నం చేయాలన్నారు. ఓటర్లు పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటు వేసేలా సిద్దం చేయాలని కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed