మూడు గుడ్లతో గిన్నిస్ రికార్డు!

by  |
మూడు గుడ్లతో గిన్నిస్ రికార్డు!
X

దిశ, వెబ్‌డెస్క్ :
గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాలంటే.. అందర్నీ ఆశ్చర్యపరిచే ప్రతిభ మన సొంతం కావాలి. అప్పుడే మనం చేసే పనికి అందరూ ఫిదా అవుతారు. ఈ క్రమంలో రికార్డులు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందుకోసం కొండల్ని మోయాల్సిన పనిలేదు, రాళ్లన్ని కరిగించాల్సిన అవసరమూ లేదు. జస్ట్ ఓ మూడు గుడ్లను ఒకదానిపై ఒకటి నిలబెడితే చాలు. మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదిస్తారు. గుడ్లను ఒకదానిపై ఒకటి నిల్చోపెట్టడమా? అదెలా సాధ్యం అంటారా? మా వల్ల కాలేదంటారా? అయితే మలేషియా, కౌలాలంపూర్‌కు చెందిన మహ్మద్ మక్బెల్ అనే ఓ 20 ఏళ్ల యువకుడు మాత్రం దాన్ని సుసాధ్యం చేసి వరల్డ్ రికార్డు సాధించాడు.

అందరూ నడిచే దారిలో వెళ్తే.. ఏముంటుంది? మనకంటూ ఓ కొత్త దారి వేసుకుంటూనే.. కదా! పది మంది ఆ కొత్త దారి వెంట వస్తారు. మహ్మద్ మక్బెల్ కూడా అదే చేసి చూపించాడు. మూడు గుడ్లను ఒకదానిపై ఒకటి నిలబెట్టి తనకే సొంతమైన ఓ కళను ప్రపంచానికి పరిచయం చేశాడు. ‘టవర్ ఆఫ్ ఎగ్స్’ కోసం ఎలాంటి గమ్ కానీ, ఇతర మెటిరీయల్‌ను కానీ అతడు ఉపయోగించలేదు. సుమారు ఐదు సెకన్ల పాటు వాటిని కిందపడకుండా ఆపగలిగాడు. తన ప్రతిభను గుర్తించిన గిన్నిస్ నిర్వాహకులు అతడి ఫీట్‌ను గిన్నిస్ బుక్‌లో రికార్డు చేశారు. కాగా, గుడ్లను ఇలా ఒక‌దానిపై ఒక‌టి నిలబెట్టేందుకు.. ఆ గుడ్లు తాజాగా ఉండాలని, అలా ఉన్నప్పుడే ఇలా నిలబెట్టడం సాధ్యమవుతుందని మక్బల్ తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story