నగరంలో వీధి కుక్కల బెడద

by  |
నగరంలో వీధి కుక్కల బెడద
X

భాగ్యనగరంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బస్తీలు, కాలనీల్లో గుంపులుగా తిరుగుతూ దాడికి పాల్పడుతున్నాయి. కుక్కల దాడిలో గాయపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం ఫీవర్​హాస్పిటల్​కు రోజుకు 30మంది బాధితులు వస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిలో చిన్నపిల్లలే ఎక్కవగా ఉంటున్నారు. కుక్కల బెడద తగ్గించేందుకు వాటికి సంతాన నిరోధక శస్త్రకిత్స (స్టెరిలైజేషన్స్‌) చేయడం, వ్యాధి నిరోధక టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఎక్కడా అమలైన దాఖలాలు లేవు.

దిశ ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వీధికుక్కల సంఖ్యపై అధికారుల వద్ద సరైన లెక్కల్లేవు. కుక్కలు ఎనిమిది నెలల వయసులోనే సంతానోత్పత్తి శక్తి కలిగి ఉండడం, ఏడాదికి రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేసే అవకాశం ఉండడంతో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక కుక్క ఏడాదిలో 40 కి పైగా పిల్లలకు జన్మనిస్తుంది. వెటర్నరీ విభాగం అధికారులు శునకాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నప్పటికీ ప్రజలకు కుక్క కాట్లు తప్పడం లేదు. బస్తీల్లోని కుక్కలకు టీకా వేయడం, సంతాన నిరోధక శస్త్ర చికిత్సచేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నప్పటికీ ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు కుక్కకాటుతో రేబిస్ వ్యాధి బారిన పడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఒకే పర్యాయం కాకుండా పైలట్‌ ప్రాజెక్టుగా గతంలోనే వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేయడంతో పాటు వాటి సంఖ్య తెలుసుకునేందుకు శ్రీకారం చుట్టారు. గత ఆగస్టు 15వ తేదీ వరకు ఈ సర్వే పూర్తి చేయాలనుకున్నప్పటికీ వెటర్నరీ సిబ్బందిలో కొందరికి కరోనా సోకడం తదితర పరిణామాలతో తీవ్ర జాప్యం ఏర్పడింది.

వాహనాల వెంట సైతం..

గ్రేటర్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో రాత్రి వేళ కుక్కల బెడద అధికంగా ఉంది. వాహనాలపై ప్రయాణించే సమయంలో వెంట పడుతున్నాయి. దీంతో వాహనదారులు కింద పడి గాయాలపాలైన ఘటనలు ఉన్నాయి. రోడ్డుపై పిల్లలు కనిపిస్తే వెంటపడి తరుముతున్నాయి. గతంలో అమీర్‌పేట్‌లో ఓ పిచ్చి కుక్క రెచ్చిపోయిం ది. ధరమ్‌కరమ్ రోడ్డులో ఓ స్కూల్ వదిలిన సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపై కుక్క దాడి చేసింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇలాంటి సంఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు.

ఇదిగో సాక్ష్యాలు..

గత మే నెలలో హైదరాబాద్‌ బోడుప్పల్‌ చంగిచర్లలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేయగా ఆమె మరణించింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన అనంతరం కూడా అధికారులు అప్రమత్తం కాకపోవడంతో పరిస్థితులు షరామామూలే అన్నట్లుగా ఉన్నాయి.

కుక్కల దాడిలో గాయపడిన వారు ప్రతినిత్యం హాస్పిటల్‌కు రావడం పరిపాటిగా మారింది. వీధి కుక్కలు కరువడంతో గాయాల బారిన పడినవారు సగటున 30 మంది ఫీవర్ ఆస్పత్రికి వస్తున్నారు. అటువంటి వారికి యాంటీ రేబిస్ టీకాలు వేస్తున్నాం. ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందిస్తున్నాం.

–డాక్టర్ శంకర్, ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్


Next Story

Most Viewed