త్వరలో యాంటీ బాడీ టెస్టులు?

by  |

దిశ, న్యూస్‌బ్యూరో
కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నందున యాంటీ బాడీ టెస్టులను నిర్వహించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. పాజిటివ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందితో పాటు పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కూడా ఈ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. క్యాన్సర్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారితో పాటు వృద్ధులకు సైతం ఈ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు వీరికి ఐజీజీ టెస్టులు చేసి ఏ మేరకు యాంటీ బాడీస్ వృద్ధి చెందాయో తెలుసుకుంటామన్నారు.రక్త పరీక్ష ద్వారా వీటిని నిర్దారిస్తామని వివరించారు. పరీక్ష చేసే నాటికి రెండు వారాల ముందు వారి శరీరంలో వైరస్ ఉందో లేదో తెలుస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ వైరస్ వచ్చి లక్షణాలేవీ లేకుండా శరీరం తట్టుకుని ఉన్నట్లయితే యాంటీ బాడీస్ ఉంటాయని, రెండు వారాల ముందు పరిస్థితి కూడా ఈ పరీక్ష ద్వారా తెలిసిపోతుందని, దాన్నిబట్టి వారికి తెలియకుండానే వైరస్ వచ్చిందీ లేనిదీ ఈ పరీక్ష ద్వారా నిర్ధారణ అవుతుందని తెలిపారు.

వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఉందో ఐసీఎంఆర్, నేషనల్ న్యూట్రిషన్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల హైదరాబాద్, నల్లగొండ, కామారెడ్డి, జనగాం తదితర ప్రాంతాల్లో ర్యాండమ్ టెస్టులు చేసింది. ఈ రిపోర్టులను ఇంకా బహిర్గతం చేయకపోయినప్పటికీ కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ, ఐసీఎంఆర్‌కు అందజేసింది. స్థానికంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందిందో లేదో ఈ రిపోర్టుల ద్వారా వెల్లడికానుంది. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర వైద్యారోగ్య శాఖ ఇటీవల మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి వైరస్ వ్యాప్తిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని యాంటీ బాడీ టెస్టులను నిర్వహించడం ద్వారా ఒక స్పష్టత కూడా వస్తుందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ అధికారి వ్యాఖ్యానించారు.

జర్నలిస్టులకు కరోనా పాజిటివ్..

నగరంలో పనిచేస్తున్న పలువురు మీడియా సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత వారానికే 14 మందికి వైరస్ సోకగా, రెండు రోజుల కిందట మరో జర్నలిస్టుకు సోకింది. తాజాగా ఇంకో ఐదుగురు జర్నలిస్టులకు పాజిటివ్ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. కరోనా కారణంగా ఒక జర్నలిస్టు రెండు రోజుల కిందటే చనిపోయాడు. మీడియాకు సైతం వైరస్ వ్యాపించడంతో వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. నగరంలో 41 మంది జర్నలిస్టుల నుంచి మంగళవారం వైద్య సిబ్బంది శాంపిళ్ళను తీసుకున్నారు. బుధవారం కల్లా వీరి రిపోర్టులు రానున్నాయి. ఎంత మందికి పాజిటివ్ వస్తుందో అనే మానసిక ఆందోళన చాలా మంది జర్నలిస్టుల్లో ఉంది.

Next Story