సర్‘కారు’కు వడ్డీల టెన్షన్ !

by  |
సర్‘కారు’కు వడ్డీల టెన్షన్ !
X

– మారటోరియంపై కేంద్రం నుంచి రాని హామీ
– ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చ జరిగే ఛాన్స్

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ సర్కారుకు కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులకు కట్టాల్సిన వడ్డీలపై టెన్షన్ పట్టుకుంది. ఎఫ్ఆర్‌బీఎమ్ పరిమితిని తప్పించుకోవడానికి బడ్జెట్ బయట రాష్ట్రంలోని కార్పొరేషన్‌లకు గ్యారంటీలిచ్చి చేసిన అప్పులు ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి. ఉద్యోగస్తులకు జీతాలే ఇవ్వలేని ప్రస్తుత సమయంలో ఈ అప్పుల వడ్డీలు తలకు మించిన భారంలా తయారయ్యాయి. తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరంలో యాసంగి ధాన్యం కొనుగోలుకుగాను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌కు ఇచ్చిన రూ.30వేల కోట్ల గ్యారంటీలతో కలుపుకొని ప్రస్తుతం ఈ అప్పులు రూ.60 వేల కోట్లపైనే ఉంటాయని తెలుస్తోంది. మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమాయానికే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన కార్పొరేషన్ల అప్పులు రూ.44 వేల కోట్ల దాకా జౌట్ స్టాండింగ్ ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది.

రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చేసిన అప్పులు పెట్టి ప్రభుత్వం ధాన్యం కొంటే దాన్ని మళ్లీ భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కొని డబ్బులిచ్చేదాకా రాష్ట్ర ప్రభుత్వమే అంత భారీ మొత్తాలకు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఈ వడ్డీలపై మారటోరియం విధించాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాన మంత్రి మోడీకి లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన లేకపోవడంతో ఇక్కడి ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కరోనా లాక్‌డౌన్‌పై ప్రధానితో సోమవారం జరగనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించాల్సిన అంశాల్లో వడ్డీలపై మారటోరియం అంశం ప్రధానంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో రెండు రోజుల నుంచి జరుపుతున్న సమీక్షల్లోనూ సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం యజమానిగా ఉన్న కాళేశ్వరం, మిషన్ భగీరథ, ట్రాన్స్‌కో, డిస్కంల వంటి కార్పొరేషన్లు ఆర్ఈసీ, పీఎఫ్‌సీ వంటి కేంద్ర ప్రభుత్వ రుణ సంస్థలు, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చినప్పటికీ ప్రభుత్వమే వాటికి గ్యారంటీగా ఉంది. అంతేగాక ఈ అప్పులకు వడ్డీలు చెల్లించడానికి ఒకటో అరో కార్పొరేషన్లకు తప్ప మిగతా వాటికి చిల్లి గవ్వ ఆదాయం లేదు. దీంతో ప్రభుత్వమే ఖజానా నుంచి వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

లాక్‌డౌన్ వల్ల రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయి ప్రభుత్వానికి జనతాకర్ఫ్యూ రోజైన మార్చి 22 నుంచి పన్నులు జమకావడం ఆగిపోయాయి. ఆదాయం 90 శాతం మేర తగ్గింది. ఏప్రిల్ నెల మొత్తం లాక్‌డౌన్‌లోనే తుడిచిపెట్టుకు పోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల వచ్చే పన్నుల వాటా రూ.1000 కోట్లు, ఓపెన్ మార్కెట్ నుంచి ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులు రూ.4వేల కోట్లు, స్వలంగా వసూలైన పన్ను ఆదాయం రూ.400 కోట్లు కలిపి ప్రభుత్వానికి ఏప్రిల్‌లో ఇప్పటివరకు సుమారు రూ.5,500 కోట్లదాకా వచ్చింది. సాధారణ పరిస్థితుల్లోనే ప్రతినెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఆదాయమే తగ్గిపోయిన ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లోనే కోత విధించక తప్పలేదు. అభివృద్ధి కార్యక్రమాలకు వ్యయాన్ని సైతం పూర్తిగా ఆపేశారు. ఇవన్నీ ఆపేయగలిగారు గానీ ప్రభుత్వం తాను చేసిన ఓపెన్ మార్కెట్ అప్పులకు, కార్పొరేషన్ల పేరిట ఎఫ్ఆర్‌బీఎమ్ బయట చేసి అప్పులకు వడ్డీ చెల్లింపులు మాత్రం తప్పనిసరిగా చేయాల్సి ఉంది. వీటికి ఎలాంటి మినహాయింపు కేంద్రం, ఆర్బీఐ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం ప్రతి నెల వందల కోట్లలో చేయాల్సిన వడ్డీ చెల్లింపులు ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లోనూ తప్పడం లేదు.

అయితే, తాజాగా జరుగుతున్న యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడంతో గులాబీ పార్టీ నేతలకు కోపం కట్టలు తెంచుకుంటోంది. ధాన్యం విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై లోకల్ బీజేపీ లీడర్లు ఇటీవల అర రోజు ఉపవాస దీక్షలు చేశారు. దీనికి టీఆర్ఎస్ నేతల నుంచి గట్టి కౌంటర్లే వచ్చాయి. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్ కమలం లీడర్లపై ఘాటు విమర్శలే చేశారు. దొంగ దీక్షలాపి కేంద్రం నుంచి సాయం వచ్చేలా చూడాలని వారికి సూచించారు. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అయితే ఏకంగా కేంద్రం వల్లే ధాన్యం కొనుగోళ్లకు తాము వేల కోట్లలో చేసిన అప్పులకు 6నుంచి 7 నెలలు వడ్డీలు భరించాల్సి వస్తోందని, దీనికి మినహాయింపు ఇచ్చే విషయం ఆలోచించకుండా బీజేపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

tags: telangana, lockdown, tax income, corporations, debt, interest payment, central government



Next Story

Most Viewed