కొత్త సంకల్పానికి ‘శ్రీకారం’ చుట్టాడా?

by  |
కొత్త సంకల్పానికి ‘శ్రీకారం’ చుట్టాడా?
X

దిశ, సినిమా : సంవత్సరానికి 9 లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటికొస్తుంటే, కేవలం 3 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? అదెవరూ ఆలోచించరు. చదువు పూర్తయితే చాలు, తెలిసిన ప్రతీ ఒక్కడు.. ‘ఏరా’ ఏం చేస్తున్నావు? ఇంకా జాబ్ రాలేదా? అని యథాలాపంగా అడిగేయడమే! ఈ క్రమంలో టాలెంట్ ఉన్నోడు ఏదోలా సాఫ్ట్‌వేర్ జాబ్ సంపాదిస్తున్నాడు, లేనోడు సిటీలోనే ఇంకేదో జాబ్‌లో సెటిల్ అవుతున్నాడు. అంతేకాని వ్యవసాయం చేసేవాడు మాత్రం లేడు, చేసినా హర్షించేవాళ్లే లేరు. ఒకప్పుడు మన తాతలకు పదుల ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉంటే, నాన్నల దగ్గరకొచ్చేసరికి అది సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. ఈ లెక్కన ‘తినేవాళ్లు మన జుట్టు మీద వెంట్రుకలంత మంది ఉంటే, పండించేవాళ్లు మూతి మీద మీసమంత కూడా ఉండటం లేదు’. పైగా ఒక డాక్టర్, తన కొడుకును డాక్టర్ చేయాలనుకుంటున్నట్టుగా, ఒక యాక్టర్ తన కొడుకును యాక్టర్ చేయాలనుకుంటున్నట్టుగా, రైతు మాత్రం తన కొడుకును ఎందుకు రైతుగా చూడాలనుకోవడం లేదు? ఒకప్పుడు పండగలా సాగిన సాగు.. ఇప్పుడెందుకు గుదిబండలా మారింది? వంటి ప్రశ్నలకు పరిష్కారం చూపించే ప్రయత్నమే ‘శ్రీకారం’.

ఇక కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే కార్తీక్ (శర్వానంద్) సంక్రాంతి పండగకు ఇంటికొస్తూ.. పచ్చిని పొలాల గాలి పీల్చుకొని మన ఊరొచ్చేస్తోందని చెప్పే సీన్‌తో కథ మొదలవుతుంది. నిజానికి నగరాల్లో జాబ్ చేస్తూ పండగకు సొంతూరుకు వెళ్లే ప్రతీ ఒక్కరూ ఈ సీన్‌లో తప్పకుండా తమను రిలేట్ చేసుకుంటారు. పండగ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లిన కార్తీక్‌కు ఒకప్పుడు తమఊళ్లో వ్యవసాయం చేసుకుంటూ దర్జాగా బతికిన కొందరు, ప్రస్తుతం పట్నంలో చేస్తున్న పనులు చూసి చలించిపోతాడు. ఈ క్రమంలోనే కార్తీక్‌కు తను పనిచేస్తు్న్న కంపెనీ తరఫున ఓ ప్రాజెక్ట్ విషయమై అమెరికాకు వెళ్లే చాన్స్ వస్తుంది. కానీ కార్తీక్‌ను ప్రేమిస్తున్న చైత్ర(ప్రియాంక అరుల్ మోహన్) తండ్రికి తను అమెరికాకు వెళ్లడం లేదని, వ్యవసాయం చేయాలనుకుంటున్నాని చెప్పడంతో హీరో మోటో రివీల్ అవుతుంది. అయితే మరోవైపు కొడుకు అమెరికా వెళ్తున్నాడని పట్టరాని సంతోషంలో ఉన్న తండ్రి కేశవులుకు కార్తీక్ నిర్ణయం షాక్ ఇస్తుంది. ఈ నిర్ణయాన్ని అతడు వ్యతిరేకించినా కార్తీక్ మాత్రం ‘ఉమ్మడి వ్యవసాయం’ చేసేందుకు సిద్ధమవుతాడు.

పట్నంలో బతుకుతున్న తమ ఊరివాళ్లందరినీ పిలిపించి.. ఉమ్మడి వ్యవసాయం ప్రతిపాదనను చెబుతాడు. కానీ వారిలో చాలామంది తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. ‘కరెంటు ఉంటే నీళ్లు ఉండవు, నీళ్లు ఉంటే దిగుబడి ఉండదు, దిగుబడి ఉంటే మార్కెట్‌లో రేటు ఉండదు. ఈ కష్టాలు పడలేకే పట్నంలో ఏదో పనిచేసుకుంటున్నాం. మళ్లీ మమ్మల్ని అవే కష్టాల్లోకి లాగొద్దు’అని వెళ్లిపోతారు. అయినా నిరాశపడకుండా ముందుకొచ్చిన వాళ్లతోనే కొత్త సాగు పద్ధతికి ‘శ్రీకారం’ చుడతాడు కార్తీక్. సాగు పద్ధతులను సమూలంగా మార్చే సంకల్పంతో.. నేలను బట్టి పంటలను మారుస్తూ, అధునాతన టెక్నాలజీ సాయంతో 80 శాతం వాణిజ్య పంటలను గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా పండించేందుకు ‘ఉమ్మడి వ్యవసాయం’ మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఒక చదువుకున్న వాడు వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందో.. ప్రపంచానికి చూపెట్టి ‘వ్యవసాయం దండగ కాదు.. పండగ అని’ నిరూపించి యూత్ ఐకాన్‌గా నిలుస్తాడు. ఎంతోమంది చదువుకున్నవారు, ఉద్యోగులు సాగు బాట పట్టేలా ప్రేరణనిస్తాడు.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు కిషోర్ ఎంచుకున్న కాన్సెప్ట్.. ఈ సినిమాకు బలాన్నిచ్చింది. కరోనా టైమ్‌ను కూడా సినిమాలో ఉపయోగించుకున్న విధానం బాగుంది. పంటలకు ధర లేనప్పుడు రైతులే స్వయంగా ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవచ్చనే విషయంతో పాటు అందుకు సోషల్ మీడియాను వాడుకునే విధానాన్ని చక్కగా చూపించారు. ఇక శర్వానంద్ ఎప్పటిలాగే తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా.. రైతు పాత్రలో రావు రమేష్ జీవించేశాడు. వీరిద్దరి మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. మిగతా వారంతా తమ పరిధి మేర ఆకట్టుకున్నారు. కాగా మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా అందించిన సంభాషణలు ‘ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం.. సేద్యాన్ని కూడా గెలుస్తాం’, ‘చీ గవర్నమెంట్ ఉద్యోగం.. నాకున్న నాలుగెకరాల కన్నా ఎక్కువా?’, ‘మట్టి మొండికేస్తోంది’ అంటూ సందర్భోచితంగా అద్భుతమైన డైలాగ్స్ పేల్చారు. మిక్కీ జె మేయర్ నేపథ్య సంగీతంతో పాటు పెంచలదాస్ అందించిన ‘వత్తానంటివో పోతానంటివో’ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మైనస్ :

కథనంలో సాగదీత, ఇంటర్వెల్ వరకు సాదాసీదా సన్నివేశాలతో ముగించడం. ఇక ఉమ్మడి వ్యవసాయం కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక పాటలోనే చెప్పిన ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. మొదట షార్ట్ ఫిల్మ్‌గా రూపొందించిన ఈ కథను నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట ఫుల్ లెంగ్త్‌ సినిమా తీసేందుకు ముందుకొచ్చారని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రివీల్ చేశారు. ఈ కథను సినిమాగా మలిచే క్రమంలో నిజంగానే కమర్షియల్ అంశాలు లోపించాయి. సినిమా మొత్తం ఎలాంటి ట్విస్టులు లేకుండా సాఫీగా సాగిపోవడం ఆసక్తిగా అనిపించదు.

కాస్టింగ్ : శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, సాయికుమార్, రావు రమేష్, మురళిశర్మ, నరేష్, ఆమని, సప్తగిరి, సత్య
సంగీతం: మిక్కీ జె మేయర్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
కెమెరా: యువరాజ్
నిర్మాత: రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట
దర్శకత్వం: కిషోర్ బి
విడుదల తేదీ: 11 మార్చ్ 2021

Next Story