తలకు తీవ్ర గాయం.. అర్థాంతరంగా ముగిసిన యువ క్రికెటర్ కెరీర్

by Harish |

ఆస్ట్రేలియా యువ క్రికెటర్ విల్ పుకోవిస్కీ కెరీర్ అర్థాంతరంగా ముగిసింది.

తలకు తీవ్ర గాయం.. అర్థాంతరంగా ముగిసిన యువ క్రికెటర్ కెరీర్
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా యువ క్రికెటర్ విల్ పుకోవిస్కీ కెరీర్ అర్థాంతరంగా ముగిసింది. ఓ మ్యాచ్‌లో తలకు అయిన గాయం కారణంగా అతను ఆటనే వదిలేయాల్సి వచ్చింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ 27 ఏళ్ల పుకోవిస్కీ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2021లో భారత్‌పై అతను టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అరంగేట్రం చేసిన మ్యాచే చివరిది కావడం గమనార్హం. గతేడాది ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో రెలే మెరిడిత్ వేసిన బౌన్సర్ పుకోవిస్కీ తలకు బలంగా తాకింది. గాయం తీవ్రతను అంచనా వేసిన మెడికల్ ప్యానెల్ అతను ఇకమీద క్రికెట్ ఆడే పరిస్థితులు లేవని తేల్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుకోవిస్కీ మాట్లాడుతూ తాను మళ్లీ క్రికెట్ ఆడలేనని వెల్లడించాడు. కంకషన్ కారణంగా త్వరగా కెరీర్ ముగించడంపై ఆవేదన చెందాడు. ‘ఆస్ట్రేలియాకు ఆడాలనేది నా కల. 2021లో అది నెరవేరింది. కానీ, అక్కడితో ఆగిపోవాలని అనుకోలేదు. నాకు చాలా కెరీర్ ఉంది.15 ఏళ్లు ఆడాలనుకున్నా. బెస్ట్ బ్యాటర్‌ కావాలనుకున్నా. 100 టెస్టులు ఆడాలని కలలు కన్నా. దురదృష్టవశాత్తూ ఒక్క టెస్టుతోనే నా కెరీర్ ముగిసింది.’ అని తెలిపాడు. గాయం తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయని చెప్పాడు. రెగ్యులర్‌గా తలనొప్పి రావడం, తల తిరిగినట్టు అనిపించడం, ఇతర సమస్యలతో తాను బాధపడుతున్నట్టు తెలిపాడు. వీటి వల్ల తాను భయాందోళనకు గురవుతున్నట్టు చెప్పాడు.


Next Story