ఇంగ్లాండ్‌లో తెలుగోడి సత్తా.. శతకంతో రెచ్చిపోయిన తిలక్

by Harish |

ఇంగ్లాండ్‌ గడ్డపై టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అదరగొట్టాడు.

ఇంగ్లాండ్‌లో తెలుగోడి సత్తా.. శతకంతో రెచ్చిపోయిన తిలక్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌ గడ్డపై టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ అదరగొట్టాడు. సెంచరీతో రెచ్చిపోయాడు. అదేంటి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ తిలక్ ఆడటం లేదు కదా.. శతకం ఎలా బాదాడు అనుకుంటున్నారా?.. అవును.. తిలక్ టెస్టు సిరీస్ ఆడటం లేదు. కానీ, ఇంగ్లాండ్‌లో జరిగే దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ 1‌లో ఆడుతున్నాడు. కౌంటీ క్రికెట్ ఆడటం తిలక్‌కు ఇదే మొదటిసారి. హాంప్‌షైర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను అరంగేట్ర మ్యాచ్‌లోనే శతక్కొట్టాడు. ఎసెక్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ మంగళవారం 241 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కౌంటీ క్రికెట్‌లో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన భారత క్రికెటర్లు పీయూశ్ చావ్లా, మురళీ విజయ్, అజింక్యా రహానె జాబితాలో తిలక్ చేరాడు.

ఈ మ్యాచ్‌లో తిలక్‌ ఇన్నింగ్స్ హైలెట్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 11/2తో కష్టాల్లో పడిన సమయంలో అతను అద్భుతమైన పోరాట పటిమ కనబర్చాడు. తిలక్‌తోపాటు లియామ్ డావ్సన్(139) కూడా శతకంతో చెలరేగడంతో హాంప్‌షైర్ 453 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల లీడ్ సాధించింది. అంతకుముందు ఎసెక్స్ 296 రన్స్ చేసింది. వైట్‌బాల్ ఫార్మాట్‌లో ఇప్పటికే రాణిస్తున్న తిలక్ ఈ ఇన్నింగ్స్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తన సత్తా ఏంటో నిరూపించాడు. ప్రస్తుతం భారత టెస్టు జట్టు ఇంగ్లాండ్‌లోనే ఉన్న వేళ సెలెక్టర్లకు గట్టి సందేశం పంపించాడు. ఇన్నింగ్స్ అనంతరం తిలక్ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ‘టెస్టు క్రికెటే నా ఫేవరెట్. టీ20ల్లో వరల్డ్ నం.3 బ్యాటర్‌గా ఉన్నందున అందరూ నన్ను మంచి టీ20 బ్యాటర్ అనుకుంటారు. కానీ, నేను మంచి టెస్టు ప్లేయర్‌ని. అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.’అని తిలక్ చెప్పుకొచ్చాడు.


Next Story