భారత డ్రెస్సింగ్ రూంలో టెన్షన్.. బయటపడిన రో-కో, గంభీర్ మధ్య విబేధాలు?

by Harish |

భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు విబేధాలు తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి.

భారత డ్రెస్సింగ్ రూంలో టెన్షన్.. బయటపడిన రో-కో, గంభీర్ మధ్య విబేధాలు?
X

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు విబేధాలు తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా వారి మధ్య విబేధాలు బయటపడినట్టు ఉన్న కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి. గంభీర్‌ను కోహ్లీ పట్టించుకోకపోవడం, గంభీర్, రోహిత్ మధ్య హీట్ డిస్కషన్ జరుగుతున్న క్లిప్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోహ్లీ, రోహిత్‌లు టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం వారు స్వచ్ఛందంగా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు అనూహ్యంగా టెస్టులకు వీడ్కోలు పలకడం చర్చనీయాంశమైంది. సుదీర్ఘ ఫార్మాట్‌ నుంచి రో-కో తప్పుకోవడానికి గంభీరే కారణమంటూ అప్పుడు కొన్ని కథనాలు వచ్చాయి. అప్పటి నుంచే దిగ్గజ క్రికెటర్లకు గంభీర్‌కు పడటం లేదన్న పుకార్లు మొదలయ్యాయి. అప్పుడు వాటిని ఎవరూ కొట్టిపారేయలేదు. కోహ్లీ, రోహిత్‌లతో గంభీర్‌కు ఏ విషయాల్లో చెడిందో తెలియదు. కానీ, వారి మధ్య సంబంధాలు మాత్రం బాగా లేవన్నది తాజాగా వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే అర్థమవుతుంది.

గంభీర్‌ను పట్టించుకోని కోహ్లీ

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. కోహ్లీ భారీ శతకంతో కదం తొక్కి జట్టును గెలిపించాడు. రోహిత్ కూడా హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ.. గంభీర్‌‌ను పట్టించుకోలేదు. కోహ్లీ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్తూ గంభీర్ ముఖం కూడా చూడలేదు. ఫోన్ చూసుకుంటూ వెళ్లిపోయాడు. గంభీర్ మాత్రం కోహ్లీ వైపు చూస్తూ ఉన్నాడు. అలాగే, రోహిత్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ డ్రెస్సింగ్ రూం వైపు కోపంగా చూస్తున్నట్టు ఉన్న ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు కోహ్లీ సిస్టర్ భావన కోహ్లీ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు పెట్టింది. కోహ్లీ, రోహిత్ కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆమె ‘IYKYK’ అని క్యాప్షన్ ఇచ్చింది. తెలిసిన వారికి మాత్రమే అని దాని అర్థం. గంభీర్‌ను ఉద్దేశించే కోహ్లీ సోదరి ఆ పోస్టు పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే సమయంలో కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ..‘ఆధిపత్యం చెలాయించాలనే చూస్తే ఇలానే జరుగుతుంది’అని పోస్టు చేశాడు.

గంభీర్, రోహిత్ మధ్య సీరియస్ డిస్కషన్

డ్రెస్సింగ్ రూంలో గంభీర్, రోహిత్ మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వారు మామూలుగా మాట్లాడుకున్నట్టు కనిపించలేదు. వారి బాడీ లాంగ్వేజ్ చూస్తే మాత్రం వాగ్వాదంలాగే అనిపించింది. దేని గురించి ఆ హీట్ డిస్కషన్ జరిగిందన్నది తెలియదు.

గంభీర్‌తో బీసీసీఐ మీటింగ్!

రో-కో, గంభీర్‌ల మధ్య సంబంధాలు బాగా లేవన్న వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీసీసీఐ దృష్టికి కూడా వెళ్లినట్టు సమాచారం. హెడ్ కోచ్‌తో బోర్డు మీటింగ్‌ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. రెండో వన్డే జరిగే రాయ్‌పూర్‌లో ఈ సమావేశం ఉండనున్నట్టు వార్తలు వస్తున్నాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా‌లతోపాటు పలువురు బోర్డు పెద్దలు గంభీర్‌తో పలు అంశాలపై చర్చించనున్నట్టు సదరు కథనాలు పేర్కొన్నాయి. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్, జట్టు ప్రదర్శన‌తోపాటు రోహిత్, కోహ్లీల భవితవ్యంపై కూడా డిస్కషన్ జరగనున్నట్టు తెలిపాయి.


Next Story