గెలిచి నిలుస్తారా..? తప్పక గెలవాల్సిన టీమిండియా సమస్యలివే..!

by Phanindra |

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో భారత్ నాలుగో టెస్టు బుధవారం ప్రారంభం అవుతోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచులో టీమిండియాను వెన్నాడుతున్న సమస్యలివే..!

గెలిచి నిలుస్తారా..? తప్పక గెలవాల్సిన టీమిండియా సమస్యలివే..!
X

దిశ, స్పోర్ట్స్: భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు బుధవారం ప్రారంభం అవుతోంది. టీమిండియాకు అంత గొప్ప రికార్డు లేని మాంచెస్టర్ వేదికగా జరిగే ఈ మ్యాచులో గెలిస్తేనే.. సిరీసులో భారత్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌కు ముందు జట్టును గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. నితీశ్ కుమార్, ఆకాశ్ దీప్, రిషభ్ పంత్ గాయాలతో బాధపడుతున్నారు. దీనికితోడు ఆటలో కూడా ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ కొంత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలన్నింటీని యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అధిగమిస్తాడా? ఈ మ్యాచ్ గెలిచి టీమిండియా పోటీలో నిలుస్తుందా? లేదంటే ఇక్కడే సిరీస్‌ను ఇంగ్లండ్ ముగిస్తుందా?

ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో భారత్‌కు ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా లేదు. దానికితోడు కుర్ర జట్టుతో ఆడుతున్న టీమిండియాకు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్ కూడా. లార్డ్స్‌లో విజయం ముంగిట వరకు వచ్చిన భారత జట్టు.. చివర్లో బోల్తా పడింది. ఈ క్రమంలో కొన్ని లోపాలు సరిచేసుకుంటే చరిత్ర తిరగరాయడం భారత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో టీమిండియా బలంగా కనిపిస్తున్నా కూడా కీలక సమయాల్లో తడబడుతోంది. మాంచెస్టర్ టెస్టుకు వరుణుడి ముప్పు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో.. ఇంగ్లండ్‌కు తమ పొరపాట్లతో టీమిండియా ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.

పట్టు వదలకూడదు..

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీసులో భారీగా పరుగులు చేసిన బ్యాటర్లలో గిల్, పంత్ ఉన్నారు. బౌలర్లలో బుమ్రా, సిరాజ్ ఉన్నారు. అయినా సరే 2- 1 తేడాతో మనం వెనకబడ్డాం. దీనికి కారణం కీలక సమయాల్లో మ్యాచ్‌పై పట్టుకోల్పోవడమే. కాబట్టి ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో గెలవాలంటే టీమిండియా ఏ మాత్రం పట్టు విడవకూడదు. బుమ్రా, సిరాజ్ వంటి వరల్డ్ క్లాస్ పేసర్లతో ఇంగ్లండ్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాలి. వాళ్లకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా బజ్‌బాల్ ఆటతో ఒక సెషన్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తారు.

బ్యాటింగ్‌లో..

మూడో స్థానంలో వస్తున్న కరుణ్ నాయర్ మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. తనకు లభిస్తున్న మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాలి. నాయర్ కనుక ఆ పని చేస్తే.. టీమిండియా బ్యాటింగ్ విభాగానికి పెద్ద ఊరట లభించినట్లే. ఇక లార్డ్స్ టెస్టులో కేఎల్ రాహుల్, పంత్ కూడా తమకు దొరికిన మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇంగ్లండ్ ప్లేయర్ల మీద కోపంతో గిల్ కూడా ఫోకస్ కోల్పోయాడు. అలా జరగకపోయుంటే లార్డ్స్‌లో కచ్చితంగా మనమే గెలిచేవాళ్లం.

ఫీల్డింగ్ లోపాలు..

ఈ సిరీస్ మొదలైన తొలి టెస్టులో టీమిండియా ఫీల్డింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అందరూ బాగానే ఫీల్డింగ్ చేస్తున్నట్లు కనిపించినా.. స్లిప్స్‌లో టీమిండియా ఫీల్డింగ్ అంతగొప్పగా లేదనే చెప్పాలి. ఇంగ్లండ్‌లో ఎడ్జ్‌ తీసుకొని వచ్చే క్యాచులే ఎక్కవగా ఉంటాయి. అలాంటప్పుడు స్లిప్స్‌లో ఫీల్డింగ్ అద్భుతంగా ఉండాలి. టీమిండియా ఫీల్డింగ్ ఆ స్థాయిలో లేదనే చెప్పాలి.

Next Story