ఆసియా కప్‌లో భారత్ vs పాక్ మ్యాచ్ వద్దంటూ గొడవలు.. ఆపడం కుదరదా?

by Phanindra |   (  Updated:2025-07-29 18:35:26  IST  )

ఆసియా కప్‌లో భారత్ vs పాక్ మ్యాచ్ వద్దంటూ గొడవలు జరుగుతున్నాయి. పార్లమెంటులో కూడా ఈ మ్యాచ్ రద్దు చేయాలంటూ విమర్శలు వస్తున్నాయి.

ఆసియా కప్‌లో భారత్ vs పాక్ మ్యాచ్ వద్దంటూ గొడవలు.. ఆపడం కుదరదా?
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచ క్రికెట్లోనే అత్యంత హైప్ ఉండే రైవలరీ భారత్, పాకిస్తాన్. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంటే వ్యూయర్‌షిప్ రికార్డులన్నీ బద్దలవ్వాల్సిందే. ప్రపంచం అంతా ఈ మ్యాచ్ కోసం ఎగ్జయిట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచులే పెద్ద తలనొప్పిగా మారాయి. పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్‌తో ఎలాంటి సంబంధాలు కంటిన్యూ చేయకూడదని భారత్ డిసైడ్ అయింది. అయితే తాజాగా ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందనే వార్త.. దేశంలో కలకలం రేపింది. పహెల్గాం దాడి చేయించిన పాకిస్తాన్‌తో క్రికెట్ ఎలా ఆడుతారంటూ బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ జరుగుతుందా? జరగదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. మరి ఆసియా కప్‌లో ఈ రెండు జట్లు తలపడతాయా? లేదంటే టోర్నీ నుంచి టీమిండియా తప్పుకుంటుందా?

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తాజాగా ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించడంతో దేశంలో పెద్ద వివాదం చెలరేగింది. సెప్టెంబరు 9 నుంచి 25 వరకు ఈ టోర్నీ జరుగుతుందని ఏసీసీ చైర్మన్ మొహ్‌సిన్ నఖ్వీ ప్రకటించారు. ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 14న దుబాయి వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇదే గొడవకు కారణమైంది. పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచులు ఆడకూడదని అంటున్న పలువురు.. పాక్‌తో క్రికెట్ సంబంధాలు కూడా తెంచేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటులో కూడా పలువురు నేతలు ఈ అంశంపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అయితే ఇలా ఎంతమంది ఎన్ని అభ్యంతరాలు చెప్పినా, గొడవలు చేసినా.. భారత్, పాక్ మ్యాచ్ ఆపడం కుదరదని నిపుణులు అంటున్నారు.

పాక్‌కే లాభం ఎక్కువ!

ఆసియా కప్ అనేది కేవలం రెండు దేశాల మధ్య జరుగుతున్న పోటీ కాదని, మల్టీ నేషనల్ టోర్నమెంట్ల నుంచి తప్పుకోవడం సరైన పని కాదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ‘ఒకవేళ భారత్ కనుక ఈ మ్యాచ్ ఆడకుండా తప్పుకుంటే.. పాకిస్తాన్‌కు చాలా అడ్వాంటేజీ వస్తుంది. అంటే ఆడకుండా వారికి ఫ్రీగా పాయింట్స్ ఇచ్చేసినట్లే. అలా చేయడం కరెక్ట్ కాదు కదా’ అని వారు చెప్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అదే సమయంలో బీసీసీఐని ప్రభుత్వం కిందకు తెచ్చేందుకు త్వరలోనే నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును తీసుకొస్తోంది. అయితే ఇది ఇంకా అమల్లోకి రాలేదు. ఈ బిల్లు అమలైతే పాక్‌తో టీమిండియా ఆడకుండా ప్రభుత్వం అడ్డుకునే అవకాశం ఉంది. కానీ ఇది ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి.. ప్రస్తుతానికి ఈ అంశంలో క్రీడాశాఖ ఏం చెప్పలేదని నిపుణులు అంటున్నారు.

ఒలింపిక్స్ చార్టర్‌ కీలకం..

గతంలో అయితే పాకిస్తాన్‌తో ఆడబోమని టీమిండియా గట్టిగా చెప్పే అవకాశం ఉండేది. కానీ తాజాగా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడంతో పరిస్థితి ఇంకా కాంప్లికేట్ అయింది. ఈ కారణంగా మల్టీ నేషనల్ టోర్నీలన్నీ కూడా ఒలింపిక్ చార్టర్‌ను ఫాలో అవ్వాల్సిందే. దీని ప్రకారం, క్రీడల్లో రాజకీయ కారణాల వల్ల వివక్ష చూపించకూడదు. ఈ కారణంగానే అంతర్జాతీయ ఈవెంట్ల కోసం తమ జట్టును భారత్‌కు పంపేందుకు పాకిస్తాన్ అంగీకరిస్తోంది, అలాగే భారత్‌ కూడా దీన్ని వ్యతిరేకించడం లేదు. ఇటీవలే పాక్ హాకీ జట్టు కూడా భారత్‌లో జరిగే టోర్నీలకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే.

భారత్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను యూఏఈలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. తొలుత దీన్ని వ్యతిరేకించినా.. చివరకు బీసీసీఐ కూడా దీనికి అంగీకరించింది. ఇలాంటి పరిస్థితిలో భారత్, పాక్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయడం, ఆడకుండా తప్పుకోవడం కుదరదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఈ మ్యాచ్ ఒలింపిక్ చార్టర్‌ను కూడా ఫాలో అవ్వాలి కాబట్టి.. దీన్ని నిరాకరిస్తే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందనేది వారి వాదన. ఈ కారణాల వల్ల ఎన్ని విమర్శలొచ్చినా భారత్, పాక్ మ్యాచ్ జరగడాన్ని ఆపలేమని అంటున్నారు.

Next Story