ఆ ఐదు సిక్సర్ల వల్లే నా పెళ్లి జరుగుతుంది.. ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన రింకు సింగ్

by Harish |

ఐపీఎల్-2023‌లో టీమిండియా యువ బ్యాటర్ రింకు సింగ్ కొట్టిన ఐదు సిక్సర్లు తన కెరీర్‌నే కాదు జీవితాన్ని కూడా మలుపుతిప్పాయి.

ఆ ఐదు సిక్సర్ల వల్లే నా పెళ్లి జరుగుతుంది.. ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన రింకు సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2023‌లో టీమిండియా యువ బ్యాటర్ రింకు సింగ్ కొట్టిన ఐదు సిక్సర్లు తన కెరీర్‌నే కాదు జీవితాన్ని కూడా మలుపుతిప్పాయి. నైట్‌కు నైటే స్టార్ అయిపోయాడు. తాజాగా ఓ యూట్యూబ్‌కు చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకు.. గుజరాత్ టైటాన్స్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడు. తనకు కాబోయే భార్య, ఉత్తర ప్రదేశ్ ఎంపీ ప్రియ సరోజ్‌తో పెళ్లికి కూడా ఆ సిక్సర్లే సాయపడ్డాయని చెప్పాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న రింకు, ప్రియ ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.

‘ఆ ఇన్నింగ్స్ తర్వాత ప్రియ నాకు ఫోన్ చేసింది. మాట్లాడుతూనే భావోద్వేగానికి గురై ఏడ్చేసింది. ఆ రోజు నాకు చాలా స్పెషల్. ఆ సిక్సర్లు కొట్టిన తర్వాతే ప్రజలు నా గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. చాలా విషయాలు సులభయ్యాయి. అందులో నా పెళ్లి కూడా ఉంది. అప్పటికీ ప్రియ తండ్రికి నేనెవరో తెలియదు. ఆయనికి క్రికెట్‌పై ఆసక్తి లేదు.’అని తెలిపాడు. ఆ ఇన్నింగ్స్ తన జీవితాన్ని మార్చేసిందని, రాత్రికి రాత్రే అంతా మారిపోయిందన్నాడు. ‘నాకు లైఫ్ చేజింగ్ మూమెంట్ అది. నా కష్టానికి ప్రతిఫలం ఆ మ్యాచ్ వల్ల లభించింది. గుర్తింపు వచ్చింది. అభిమానులు పెరిగారు. రాత్రికి రాత్రే అంతా మారిపోయింది. ఆ రోజు పేరు, ఫాలోవర్లు, అన్నీ ఇచ్చింది.’అని రింకు ఆ ఇన్నింగ్స్ గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం రింకు యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్‌‌ ఆడుతున్నాడు.


Next Story