ఫైనల్‌‌లో అడుగుపెట్టిన సాత్విక్ జోడీ

by Dishafeatures2 |
ఫైనల్‌‌లో అడుగుపెట్టిన సాత్విక్ జోడీ
X

జకార్తా : ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పురుషుల జంట సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోరు కొనసాగుతోంది. క్వార్టర్స్‌లో వరల్డ్ నం.1 జోడీకి షాకిచ్చిన భారత ద్వయం.. సెమీస్‌లోనూ అదే జోరు కనబర్చింది. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్‌ సెమీస్‌లో సాత్విక్ జోడీ 17-21, 21-19, 21-18 తేడాతో కొరియా‌కు చెందిన కాంగ్ మిన్ హ్యుక్-సియో సెయుంగ్ జే‌పై పోరాడి గెలిచింది. దాంతో ఇండోనేషియా ఓపెన్‌లో తొలిసారిగా ఫైనల్‌కు అర్హత సాధించింది. గంట 7 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో మొదట సాత్విక్ జోడీకి శుభారంభం దక్కలేదు. కొరియా జోడీ పూర్తి ఆధిపత్యంతో తొలి గేమ్‌ను గెలుచుకోవడంతో భారత జంటపై ఒత్తిడి పెరిగింది. అయితే, రెండో గేమ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన సాత్విక్ జోడీ మొదటి నుంచి ఆధిక్యం చాటుతూ గేమ్‌ను దక్కించుకుంది. చివర్లలో ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా తట్టుకుని నిలబడింది.

ఇక, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇరు జంటలు నువ్వానేనా అన్నట్టు తలపడటంతో స్కోరు 5-5తో సమమైంది. ఆ తర్వాత వరుసగా 7 పాయింట్లు నెగ్గి 12-5తో లీడ్‌లోకి వెళ్లిన సాత్విక్ జోడీ సునాయాసంగా విజేతగా నిలిచేలా కనిపించింది. అయితే, ప్రత్యర్థుల పుంజుకోవడంతో 16-16 వద్ద స్కోరు సమమయ్యాయి. అయితే, వరుసగా పాయింట్స్ నెగ్గడంతో భారత ద్వయం విజయం ఖాయమైంది. దాంతో ఇండోనేషియా ఓపెన్‌లో తొలిసారిగా సాత్విక్-చిరాగ్ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అలాగే, డబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో సూపర్ 1000 టోర్నీ ఫైనల్‌కు చేరుకోవడం కూడా ఇదే మొదటిసారి.

ప్రణయ్ ఔట్

ఇండోనేషియా ఓపెన్‌ సింగిల్స్‌‌లో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. పీవీ సింధు, లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్ర్కమించగా.. సెమీస్‌లో హెచ్ఎస్ ప్రణయ్ సైతం ఇంటిదారిపట్టాడు. మెన్స్ సింగిల్స్‌లో సెమీస్‌లో ప్రణయ్ 15-21, 15-21 తేడాతో వరల్డ్ నం.1, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్ చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌‌లో 8-8తో స్కోరు సమమయ్యే వరకు ప్రత్యర్థితో హోరాహోరీగా తలపడిన ప్రణయ్ ఆ తర్వాత తేలిపోయాడు. రెండో గేమ్‌లో మొదటి నుంచి వెనుకబడిన అతను.. మధ్యలో పుంజుకుని 15-17తో ప్రత్యర్థికి చేరువైన ఆ పోటీని కొనసాగించలేకపోయాడు. గత నెలలో ప్రణయ్ మలేసియా ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed