జాతీయ క్రీడల్లో సత్తాచాటిన తెలుగమ్మాయి.. స్వర్ణం గెలిచిన జ్యోతి

by Harish |

భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యర్రాజి జ్యోతి అదరగొట్టింది.

జాతీయ క్రీడల్లో సత్తాచాటిన తెలుగమ్మాయి.. స్వర్ణం గెలిచిన జ్యోతి
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యర్రాజి జ్యోతి అదరగొట్టింది. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించింది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో విజేతగా నిలిచింది. వరుసగా మూడో నేషనల్ గేమ్స్‌లో జ్యోతి గోల్డ్ మెడల్ గెలవడం విశేషం. 2022, 2023 జాతీయ క్రీడల్లో ఆమె స్వర్ణం సాధించింది. ఆదివారం జరిగిన ఈవెంట్‌లో జ్యోతికి క్వాలిఫికేషన్ రౌండ్‌లో, ఫైనల్‌లో ఎదురులేదు. ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆమె 13.20 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచింది.

ఫైనల్‌లో క్వాలిఫికేషన్ రౌండ్ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. 13.10 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ప్రదర్శనతో ఆమె పేరిటే ఉన్న జాతీయ క్రీడల రికార్డును ఆమెనే బద్దలు కొట్టింది. 2023 జాతీయ క్రీడల్లో 13.22 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోగా.. ఈ సారి 0.12 సెకన్ల కంటే ముందు రేసును పూర్తి చేసింది. అలాగే, జ్యోతి ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధించింది. జ్యోతి తెచ్చిన స్వర్ణంతో టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో 5వ గోల్డ్ మెడల్ చేరింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన మౌమితా మోండల్(13.36 సెకన్లు) రజతం, తమిళనాడుకు చెందిన నిత్య రామ్‌రాజ్(13.60 సెకన్లు) కాంస్యం సాధించారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కు మరో పతకం కూడా దక్కింది. పురుషుల డెకాథ్లాన్‌లో రోహిత్ రోమన్ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. ఇప్పటివరకు జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం 12 పతకాలు సాధించింది. అందులో 5 స్వర్ణాలు, ఓ రజతం, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. మెడల్ టేబుల్‌లో 18వ స్థానంలో ఉన్నది. సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు 71 మెడల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.


Next Story