- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశవాళీ క్రికెట్ బాటపట్టిన స్టార్ క్రికెటర్లు
టీమిండియా స్టార్ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల బీసీసీఐ విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సిందేనని జాతీయ జట్టు క్రికెటర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కనీసం రెండు మ్యాచ్‌లైనా ఆడాలని ఆ ఆదేశాల్లో బోర్డు పేర్కొంది. ఏ రెండు మ్యాచ్‌ల్లో ఆడాలనే నిర్ణయం ఆటగాళ్లకే వదిలేసింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ఇతర స్టార్ ఆటగాళ్లు కూడా రంగంలోకి దిగారు. బుధవారం నుంచి ప్రారంభంగానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నారు. దీంతో ఈ దేశవాళీ వన్డే టోర్నీకి కొత్త ఆకర్షణ రానుంది. స్టార్లు క్రికెటర్లు రానుండటంతో స్టేడియాలకు ప్రేక్షకులు కూడా ఎక్కువగానే వచ్చే అవకాశాలు ఉంటాయి.
గతంలో ఐపీఎల్‌లో ప్రతిభ చాటిన ప్లేయర్లనే జాతీయ జట్టులోకి తీసుకుంటుదని బీసీసీఐ విమర్శలు వచ్చేవి. యువ ప్లేయర్లు కూడా ఐపీఎల్‌లో సత్తాచాటితే చాలు టీమిండియా నుంచి పిలుపు అందుకోవచ్చనే భావనలో ఉండేవారు. ఐపీఎల్‌లో మెరిసి జాతీయ జట్టులోకి వచ్చిన చాలా మందే ఉన్నారు. దీంతో యువ క్రికెటర్లలో దేశవాళీ క్రికెట్‌పై ఆసక్తి తగ్గుతోందని మాజీ క్రికెటర్లు కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ దేశవాళీ క్రికెట్ ఆడటాన్ని కచ్చితం చేస్తోంది. జాతీయ జట్టుకు ఆడని వాళ్లు దేశవాళీలో ఆడాలని చెబుతోంది. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో రోహిత్, కోహ్లీలతోపాటు పలువురు ప్లేయర్లు ఆడారు. ఆటగాళ్లను దేశవాళీలో ఆడించడంతోనే బోర్డు సరిపెట్టడం లేదు. అక్కడ రాణిస్తే జాతీయ జట్టులోకి కూడా తీసుకుంటోంది. ఇందుకు టీ20 ప్రపంచకప్‌కు ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడం ఉదాహరణ. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను సత్తాచాటిన విషయం తెలిసిందే. దీంతో రెండేళ్ల తర్వాత అతను జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఇషాన్ కిషన్ రీఎంట్రీని స్వాగతించాడు. దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శననే కొలమానంగా మారాలని చెప్పాడు.
అందరి కళ్లు రోహిత్, కోహ్లీలపైనే
విజయ్ హజారే ట్రోఫీలో భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ హైలెట్ కానున్నారు. కోహ్లీ 12 ఏళ్ల తర్వాత, రోహిత్ 10 ఏళ్ల తర్వాత లిస్ట్ ఏ క్రికెట్ ఆడబోతుండటం గమనార్హం. దీంతో అందరి దృష్టి వీళ్లపైనే ఉండనుంది. ముంబై తరపున రోహిత్, ఢిల్లీకి కోహ్లీ ఆడనున్నారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వీరు బరిలోకి దిగనున్నారు. ముంబై ఈ నెల 24న సిక్కీంతో, 26న ఉత్తరాఖండ్ జట్లను ఎదుర్కోనుంది. అవే తేదీల్లో ఢిల్లీ జట్టు ఆంధ్ర, గుజరాత్‌లతో ఆడనుంది. ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా టూరు, సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ల ఈ సీనియర్లిద్దరూ సత్తాచాటారు. 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ ఆడటమే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. ఫామ్, మ్యాచ్ ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి కోహ్లీ, రోహిత్‌లు దేశవాళీ క్రికెట్ ఆడటం తప్పనిసరి అని మాజీలు సూచిస్తున్నారు.
విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న స్టార్ క్రికెటర్లు
ముంబై : రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, శార్దూల్ ఠాకూర్
పంజాబ్ : శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్
ఢిల్లీ : రిషబ్ పంత్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, హర్షిత్ రాణా, ఇషాంత్ శర్మ
కర్ణాటక : కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ
మహారాష్ట్ర : రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి
ఉత్తరప్రదేశ్ : ధ్రువ్ జురెల్, రింకు సింగ్
కేరళ : సంజూ శాంసన్, గుజరాత్ : రవి బిష్ణోయ్, బెంగాల్ : షమీ, జార్ఖండ్ : ఇషాన్ కిషన్






