తరుణ్, లక్ష్యసేన్ దూకుడుకు బ్రేక్.. సెమీస్‌లో పరాజయం

by Harish |

మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది.

తరుణ్, లక్ష్యసేన్ దూకుడుకు బ్రేక్.. సెమీస్‌లో పరాజయం
X

దిశ, స్పోర్ట్స్ : మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. సంచలన ప్రదర్శన చేసిన యువ షట్లర్, తెలుగు కుర్రాడు మన్నెపల్లి తరుణ్ దూకుడుకు సెమీస్‌లో బ్రేక్ పడింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో తరుణ్ 21-19, 16-21, 16-21 తేడాతో మలేసియాకు చెందిన జస్టిన్ హోప్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. తరుణ్ అంత తేలికగా తలవంచలేదు. గంటా 21 నిమిషాలపాటు ప్రత్యర్థితో భీకరంగా పోరాడాడు. తొలి గేమును నెగ్గి ఒక దశలో ఆధిక్యంలో నిలిచాడు. కానీ, ఆ తర్వాత పట్టు కోల్పోయాడు. ప్రత్యర్థి పుంజుకోవడంతో పలు తప్పిదాలు చేశాడు. దీంతో వరుసగా రెండు గేములను కోల్పోయి మ్యాచ్‌ను ప్రత్యర్థికి సమర్పించుకున్నాడు. దీంతో తరుణ్ సెమీస్‌లో ఇంటిదారిపట్టాడు. టోర్నీలో తరుణ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. రెండో రౌండ్‌లో ఏకంగా టాప్ సీడ్‌నే మట్టికరిపించిన విషయం తెలిసిందే. మరో స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ కూడా టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. ఇండోనేషియాకు చెందిన ఫర్హాన్ చేతిలో 21-16, 21-9 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేములో కాస్త పోటీనిచ్చిన సేన్.. రెండో గేములో పూర్తిగా తేలిపోవడంతో ప్రత్యర్థి విజయం ఏకపక్షంగా సాగింది. తరుణ్, లక్ష్యసేన్ ఓటమితో టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది.


Next Story