మకావు ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన తరుణ్, లక్ష్యసేన్

by Harish |

మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్, తెలుగు కుర్రాడు మన్నెపల్లి తరుణ్ అదరగొడుతున్నాడు.

మకావు ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన తరుణ్, లక్ష్యసేన్
X

దిశ, స్పోర్ట్స్ : మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్, తెలుగు కుర్రాడు మన్నెపల్లి తరుణ్ అదరగొడుతున్నాడు. మెన్స్ సింగిల్స్ విభాగంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. టోర్నీలో హ్యాట్రిక్ విక్టరీని నమోదు చేసి సెమీస్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో తరుణ్ 21-12, 13-21, 21-18 తేడాతో చైనాకు చెందిన హు జేను మట్టికరిపించాడు. రెండో రౌండ్‌లో టాప్ సీడ్‌కు షాకిచ్చిన తరుణ్ క్వార్టర్స్‌లోనూ సంచలన ప్రదర్శన చేశాడు. ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీని తట్టుకుని నిలబడ్డాడు. గంటా 15నిమిషాలపాటు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. తొలి, మూడు గేముల్లో నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

ఇక, స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ కూడా జోరు మీద ఉన్నాడు. అతను కూడా సెమీస్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్‌లో సేన్ 21-14, 18-21, 21-14 తేడాతో చైనా షట్లర్ జువాన్ చెన్ ఝూ‌ను ఓడించాడు. నేడు జరిగే సెమీస్ మ్యాచ్‌ల్లో ఇండోనేషియా షట్లర్ అల్వి ఫర్హాన్‌తో లక్ష్యసేన్, మలేసియా ఆటగాడు జస్టిన్ హోహ్‌తో తరుణ్ తలపడనున్నారు. మరోవైపు, భారత పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. మరోసారి అంచనాలను నిలబెట్టుకోలేకపోయిన భారత జంట క్వార్టర్స్‌లోనే ఇంటిదారిపట్టింది. మలేసియాకు చెందిన చూంగ్ హోన్ జియాన్-ముహమ్మద్ హైకల్ ద్వయం చేతిలో 21-14, 13-21, 22-20 తేడాతో పోరాడి ఓడింది. తొలి గేము కోల్పోయి తర్వాత పుంజుకున్న సాత్విక్ జోడీ రెండో గేము నెగ్గి స్కోర్లను సమం చేసింది. అయితే, నిర్ణయాత్మక మూడో గేముల్లో తీవ్రంగా కష్టపడినప్పటికీ విజయం మాత్రం మలేసియా జంటనే వరించింది.


Next Story