- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలేసియా మాస్టర్స్‌లో అదరగొడుతున్న శ్రీకాంత్.. ఆరేళ్ల తర్వాత ఓ టోర్నీలో ఫైనల్‌కు
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్‌కు ఎదురులేకుండా పోయింది.

దిశ, స్పోర్ట్స్ : మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్‌కు ఎదురులేకుండా పోయింది. కొంతకాలంగా ఫామ్ లేమితో తడబడిన అతను ఈ టోర్నీలో మాత్రం సత్తాచాటుతున్నాడు. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో జపాన్ ప్లేయర్ యుషి టనాకాను 18-21, 22-24 తేడాతో శ్రీకాంత్ మట్టికరిపించాడు. 49 నిమిషాలపాటు మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగింది. శ్రీకాంత్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి సవాల్ ఎదురైంది.
తొలి గేమ్‌లో చాలా భాగం వరకు జపాన్ ఆటగాడే ఆధిపత్యం ప్రదర్శించాడు. కానీ, 16-16తో స్కోరును సమం చేసిన శ్రీకాంత్ ఆ తర్వాత వరుస పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. ఇక, రెండో గేములోనూ మొదట సరైన ఆరంభం దక్కలేదు. ఒక దశలో 9-3తో వెనుకబడ్డాడు. అక్కడి నుంచి పుంజుకున్న శ్రీకాంత్ ప్రత్యర్థిని నిలువరిస్తూ వచ్చాడు. ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా ప్రత్యర్థిపైనే తీవ్ర ఒత్తిడి పెంచాడు. దీంతో రెండు గేముల్లోనే మ్యాచ్ శ్రీకాంత్ సొంతమైంది. ఆరేళ్ల తర్వాత శ్రీకాంత్ ఓ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. అతను చివరిసారిగా 2019లో ఇండియా ఓపెన్‌లో టైటిల్ పోరు ఆడాడు. 2017లో చివరి సారిగా ఓ టైటిల్ గెలిచాడు. మలేసియా మాస్టర్స్‌లో జోరు మీద ఉన్న శ్రీకాంత్ 8 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాలని చూస్తున్నాడు. ఆదివారం ఫైనల్‌లో చైనా ప్లేయర్ లీ షిఫెంగ్‌ను ఎదుర్కొనున్నాడు.






